
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ మంగళవారం(ఆగస్టు 19) ప్రకటించనున్నారు. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.
అయితే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తల కారణంగా పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ చేరాడు. ఈ ఖండాంతర టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జరగదని జాదవ్ థీమా వ్యక్తం చేశాడు.
"ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత జట్టు బహిష్కరించాలి. భారత్ ఆడదనే నమ్మకం నాకు ఉంది. పాకిస్తాన్‌తో ఎక్కడ ఆడినా టీమిండియానే గెలుస్తోంది. ఈ విషయం పాక్ జట్టుకు కూడా తెలుసు. కానీ ఈ మ్యాచ్ మాత్రం జరగకూడదు" అని ఏఎన్‌ఐతో జాదవ్ పేర్కొన్నాడు.
అంతకుముందు దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లను బాయ్‌కట్ చేయాలని బీసీసీఐని కోరాడు. కాగా ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది.
లీగ్ స్టేజీలో ఓ మ్యాచ్‌తో పాటు సెమీ ఫైనల్స్‌ను కూడా యువీ సారథ్యంలోని భారత్ బాయ్‌కట్ చేసింది. అయితే ఆసియాకప్‌లో మాత్రం పాక్-భారత్ జట్లు తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్ల్యూసీఎల్ అనేది ప్రైవేట్ లీగ్ కావడంతో ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించింది.
కానీ ఈ ఖండాంతర టోర్నీ ఆసియాక్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగనుంది కాబట్టి పాక్‌తో భారత్ కచ్చితంగా తలపడతుందనే చెప్పాలి. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌ను టీమిండియా బాయ్‌కట్ చేస్తే బ్రాడ్‌కాస్టర్లకు భారీ నష్టం వాటిల్లనుంది.
ఆసియాకప్‌కు భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.
చదవండి: ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఇంగ్లండ్ స్పిన్నర్