సవాల్‌కు ప్రజ్ఞానంద సిద్ధం | Candidates Chess Tournament from today | Sakshi
Sakshi News home page

సవాల్‌కు ప్రజ్ఞానంద సిద్ధం

Mar 29 2026 3:47 AM | Updated on Mar 29 2026 3:47 AM

Candidates Chess Tournament from today

నేటి నుంచి క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ 

మహిళల విభాగంలో దివ్య, వైశాలి పోటీ

పఫోస్‌ (సైప్రస్‌): ప్రపంచ చాంపియన్‌ను ఢీకొట్టే అర్హత కోసం భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ‘ఫిడే’ క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతున్నాడు. ఎనిమిది మంది ఎలైట్‌ గ్రాండ్‌మాస్టర్లు తలపడే ఓపెన్‌ కేటగిరీలో అతను సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. భారత్‌ తరఫున తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ మాత్రమే బరిలో ఉండగా... 8 మంది డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌లో ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు సై అంటున్నారు. ప్రతి ఆటగాడు మిగతా ఏడు మంది ప్రత్యర్థులను రెండేసి సార్లు ఢీకొంటాడు. 

ఇందులో అగ్ర స్థానంలో నిలిచిన ఆటగాడే చివరకు ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌తో టైటిల్‌ కోసం పోటీపడతాడు. ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ సమరం జరుగుతుంది. ప్రస్తుత క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో అమెరికన్‌ స్టార్లు ఫేబియానో కరువాన, హికరు నకముర, డచ్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనిశ్‌ గిరి, వే యి (చైనా), జావొఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), అండ్రీ ఎసిపెంకో (రష్యా), మథియస్‌ బ్లూబామ్‌ (జర్మనీ)లు చాంపియన్‌ గుకేశ్‌ను ఢీకొట్టే వేటలో ఉన్నారు. 

ఇటీవలి టోర్నీల ఫలితాలు, ఫామ్‌ దృష్ట్యా అమెరికన్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఫేబియానో కరువాన క్యాండిడేట్స్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. దీంతో భారత ఆటగాడు ప్రజ్ఞానందకు కఠిన సవాళ్లు తప్పవు. బరిలోకి ప్రపంచ శ్రేణి గ్రాండ్‌మాస్టర్లు ఉండటంతో దీనికి తగినట్లుగానే తమిళ గ్రాండ్‌మాస్టర్‌ సన్నద్ధమయ్యాడు. ప్రత్యేకించి క్యాండిడేట్స్‌ ఈవెంట్‌ కోసం మరే ఇతర టోర్నీలవైపు కన్నెత్తి చూడలేదు. 

తన కోచింగ్‌ బృందం, సాంకేతిక నిపుణులతో కలిసి క్యాండిడేట్స్‌లో ఎదురయ్యే ప్రత్యర్థుల ఎత్తుగడ్డలపైనే దృష్టిసారించాడు. కరువాన ఫేవరెట్‌ అయితే ఉజ్బెకిస్తాన్‌ ప్లేయర్‌ సిందరోవ్‌ డార్క్‌హార్స్‌గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది గోవాలో జరిగే చెస్‌ వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచి అందరి కంటా పడిన ఈ యువ సంచలనం ఇదే జోరును ఇక్కడా కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాడు.  

మహిళల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌ అయిన తెలుగుతేజం, వెటరన్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ఫేవరెట్‌గా దిగాల్సివున్నా... చివరి నిమిషంలో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. పశ్చిమాసియా పరిస్థితులే తను వైదొలగడానికి కారణమని, భయంతో ఆడలేనని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమె స్థానాన్ని నార్వే చెస్‌ టోర్నీ విజేత అన్న ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)కు కేటాయించారు. 

హంపి లేకపోయినా భారత ఆశల పల్లకిని మహిళల ప్రపంచకప్‌ విజేత దివ్య దేశ్‌ముఖ్, ఆర్‌. వైశాలి మోస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి టోర్నీ ఆరం¿ోత్సవ వేడుక జరిగింది. ఇందులో ప్లేయర్ల పరిచయ కార్యక్రమం, ర్యాంకింగ్‌ (ఎలో రేటింగ్‌), క్యాండిడేట్స్‌కు అర్హత సాధించిన వైనం వివరించారు. ఆదివారం నుంచి తొలిరౌండ్‌ పోటీలు జరుగుతాయి.

‘క్యాండిడేట్స్‌’ కహానీ... 
టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 
1 మిలియన్‌ డాలర్లు (రూ. 9.49 కోట్లు) 
ఓపెన్‌ కేటగిరీ: 
7,00,000 డాలర్లు (రూ. 6.65 కోట్లు) 
మహిళల విభాగం: 
3,00,000 డాలర్లు (రూ. 2.85 కోట్లు)

Advertisement
 
Advertisement
Advertisement