
అండర్ -19 వరల్డ్ కప్ అమెరికా క్వాలిఫయర్స్‌లో పెను సంచలనంం నమోదైంది. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ జట్టు 5 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ అరుదైన రికార్డును కెనడా అండర్-19 జట్టు తమ పేరిట లిఖించుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పరమ్ వీర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అర్జెంటీనా అండర్-19, కెనడా అండర్-19 జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కెప్టెన్ నిర్ణయానికి అర్జెంటీనా జట్టు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్జెంటీనా.. కెనడా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో కేవలం 23 పరుగులకే కుప్పకూలింది.
కెనడా పేసర్ జగ్మన్‌దీప్ పాల్ 6 వికెట్ల పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు డొమినిక్ డైన్‌స్టర్, క్రిష్ మిశ్రా తలా రెండు వికెట్లు సాధించారు. అర్జెంటీనా బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. టొమోస్ రస్సీ(6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 23 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా కేవలం 5 బంతుల్లోనే చేధించింది. ఓపెనర్ ధర్మ్ పటేల్ (1 నాటౌట్) తొలి బంతికి సింగిల్ తీయగా.. మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా(22 నాటౌట్) నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు.
కాగా యూత్ వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోర్ రికార్డు మాత్రం స్కాట్లాండ్ పేరిట ఉంది. 2004 అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ 22 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 3.5 ఓవర్లలో ఛేదించింది.
చదవండి: Jos Buttler: తండ్రి మరణం.. స్టార్ క్రికెటర్ భావోద్వేగం