భారత్‌లో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రసార హక్కులకు ఆసక్తి చూపని బ్రాడ్‌కాస్టర్స్
100 మిలియన్ డాలర్ల నుంచి 35 మిలియన్ డాలర్లకు తగ్గించినా ముందుకు రాని వైనం
వరల్డ్‌కప్ ప్రత్యక్ష వీక్షణానికి మన ప్రేక్షకులు దూరమైనట్లే
గతంలో నష్టాలు చవిచూసిన సోనీ, రిలయన్స్ సంస్థలు
ఎవరూ ముందుకు రాకపోతే కీలక మ్యాచ్‌లు దూరదర్శన్‌లో
జూన్ 11 నుంచి ‘ఫిఫా’ ప్రపంచకప్ టోర్నీ
టీమిండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు... అభిమానులు టీవీలకు అతుక్కుపోవడం మనదేశంలో తరాలుగా వస్తున్న ఆనవాయితీ! ఐపీఎల్ వచ్చాక వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. అరచేతిలో ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం వచ్చినప్పటి నుంచి ఆ సంఖ్య కోట్లు దాటేసింది. ఇదే బాటలో బ్యాడ్మింటన్ లీగ్, రెజ్లింగ్ లీగ్, టేబుల్ టెన్నిస్ లీగ్, ఖో ఖో లీగ్, ప్రీమియర్ టెన్నిస్ లీగ్, ఆర్చరీ లీగ్ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్‌లు కాస్తో కూస్తో ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... క్రికెట్ తరహాలో దేశవ్యాప్తంగా బాగా ఆదరణ దక్కించుకుంది. మట్టి ఆటతో మనకున్న అనుబంధాన్ని మ్యాట్‌పై చూపించడంతో గ్రామీణ ప్రేక్షకులు పీకేఎల్‌కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఎటొచ్చి యావత్ ప్రపంచం వీపరీతంగా ఆదరించే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ పోటీలకు మాత్రం మన దేశంలో ఆదరణ చాలా తక్కువ.
మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్‌కప్ జరగనున్నా... ఇప్పటి వరకు మనదేశంలో ఈ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది అభిమానులు కూడా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్‌కప్ ప్రత్యక్ష ప్రసార తీరు తెన్నులపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం
యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరానికి సమయం దగ్గరపడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌బాల్ మహాసంగ్రామం జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాగనుంది. నాలుగేళ్ల క్రితం ఖతర్‌లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇప్పుడు మూడు దేశాలు కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా 48 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుండగా... మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
48 జట్లను 12 గ్రూప్‌లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. గత వరల్డ్‌కప్‌లో కేవలం 64 మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా... ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. దీంతో సాధారణంగా ఆసక్తి కూడా మరింత పెరిగింది. ప్రపంచంలో 200కు పైగా దేశాల్లో ఫుట్‌బాల్ అభిమానులు ఉన్నారు. అందులో దాదాపు అన్నీ దేశాల్లో ఈ వరల్డ్‌కప్ ప్రసారాలు సాగనున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ ముగిసిన 11 రోజులకే...
ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతుండటంతో... ఎక్కడ చూసినా ఫోర్లు, సిక్స్‌లు, స్కోర్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 31వ తేదీతో ఐపీఎల్ ముగియనుండగా... ఆ తర్వాత 11 రోజులకే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. క్రికెట్‌ను మతంలా భావించే మనదేశంలో మొదటి నుంచి ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతంతమాత్రమే... ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి చోట్ల తప్ప ఫుట్‌బాల్‌పై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య చాలా తక్కువ.
మన దేశ ఫుట్‌బాల్ జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేక పోతుండటంతో పాటు... దక్షిణ అమెరికా, యూరప్ దేశాల హవా సాగే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌పై మనవాళ్లకు ఆసక్తి తక్కువే. ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంటే... ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం.

100 నుంచి 35 మిలియన్ డాలర్లలకు...
తాజా ప్రపంచకప్‌తో పాటు 2030లో జరగనున్న వరల్డ్‌కప్‌ను కలిపి సంయుక్త ప్రసార హక్కులను భారత మార్కెట్‌లో 100 మిలియన్ డాలర్లకు నిర్వాహకులు విక్రయించే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు టోర్నీల ప్రసార హక్కులను 35 మిలియన్ డాలర్లకు తగ్గించినా... ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ‘భారత్‌లో ఫుట్‌బాల్ వీక్షణ గత కొంతకాలంగా బాగా క్షీణిస్తోంది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ను చూస్తే 2013–14లో దాని విలువ 145 మిలియన్ డాలర్లు ఉండేది... అది ఇప్పుడు 60 మిలియన్ డాలర్లకు పడిపోయింది’ అని స్పోర్ట్స్ గేమింగ్ రంగ నిపుణుడు తెలిపాడు.
చేతులు కాల్చుకున్న సోనీ, రిలయన్స్
2014, 2018 ‘ఫిఫా’ వరల్డ్‌కప్ టోర్నీలను భారత్‌లో సోనీ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. వీటితో 2016 యూరో కప్‌ను కలిపి మొత్తం 90 మిలియన్ డాలర్లకు వాణిజ్య హక్కులు దక్కించుకుంది. ఆ తర్వాత 2022 వరల్డ్‌కప్ ప్రసార హక్కులను 60 మిలియన్ డాలర్లకు రిలయన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సంస్థలు కూడా ఆశించిన లాభాలు గడించలేకపోయాయి. దీంతో ఈసారి ప్రసార హక్కుల విషయంలో తర్జన భర్జన ఇంకా సాగుతోంది.
‘భారత్‌లో కేవలం అభిమానులు లేకపోవడమే కాక... మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫుట్‌బాల్ వీక్షణల విషయంలో జపాన్‌తో భారత్‌ను పోల్చడం అవివేకం’ అని స్పోర్ట్స్ గేమింగ్ ఈ స్పోర్ట్స్ లైవ్ మేనేజింగ్ పార్ట్‌నర్ రోహిత్ అన్నారు.
టైమింగ్‌తో తలనొప్పి...
ఈసారి ఫుట్‌బాల్ పండగ జరుగుతున్న కెనడా, మెక్సికో, అమెరికా కాలమానంతోనూ మనకు ఇబ్బంది ఎదురవుతోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామునే ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో వీక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు.
ఎంత ప్రధానమైన ఈవెంట్ అయినా... ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించే సమయంలో కాకుండా... అర్ధరాత్రి, అపరాత్రి ప్రసారం చేస్తే వీక్షణలు తగ్గడం సహజమే. ఈ టోర్నమెంట్‌లోని 104 మ్యాచ్‌ల్లో 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రికి ముందు ప్రారంభం కానున్నాయి. 2022 ఖతర్ వేదికగా జరిగిన టోర్నమెంట్‌లోని 64 మ్యాచ్‌ల్లో 44 మ్యాచ్‌లు ‘ప్రైమ్ టైమ్’లోనే ప్రసారమయ్యాయి.
లాభాలు లేకే...
మన దేశంలో 2022 ప్రపంచకప్ స్పోర్ట్స్–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. జియో సినిమా యాప్‌లో ఉచితంగా లైవ్ అందించగా... స్పోర్ట్స్–18 ఛానల్ మాత్రం ఈ మెగా టోర్నీ కోసం నెలకు 12 రూపాయలు వసూలు చేసింది. ఫుట్‌బాల్ దేశాల్లో ఈ ధర ఎంత భారీగా ఉన్నా... వాటి వీక్షణల్లో ఎలాంటి మార్పు రాదని... కానీ మనదేశంలో మాత్రం ఫుట్‌బాల్ కోసం సభ్యత్వం తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో అయినా లాభాలు రాకపోతే దాన్ని కొనసాగించడం కష్టమే కాబట్టి... ఏ రకంగా చూసుకున్న మన దేశంలో ఫిఫా ప్రపంచకప్‌నకు ఆదరణ పెద్దగా ఉండదనే ఉద్దేశంతోనూ ప్రసార హక్కులు కొనుగోలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
వాణిజ్య ప్రకటనలకు సమయమేది?
భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో సైతం అభిమానులు లైవ్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రోజురోజుకూ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. గత ఏడాది కాలంలో ఐఎస్‌ఎల్ ప్రసార హక్కుల విలువలో 97 శాతం తగ్గుదల నమోదైంది. క్రికెట్‌లో అయితే ఓవర్‌కు ఓవర్‌కు మధ్య వచ్చే వాణిజ్య ప్రకటనలతో ప్రసార కర్తలకు భారీగా డబ్బు వచ్చి పడుతుంది.
కానీ... ఫుట్‌బాల్‌కు మన దేశంలో అంతటి ఆదరణ ఉండదని ప్రసార సంస్థల నిపుణులు అంటున్నారు. ‘క్రికెట్‌లో ఓవర్ మారినా, వికెట్ పడినా... వాణిజ్య ప్రకటనలకు వీలు ఉంటుంది. టెన్నిస్‌లోనూ సెట్ తర్వాత స్లాట్‌లు ఉంటాయి. కానీ ఫుట్‌బాల్‌లో మ్యాచ్‌లకు ముందు, తర్వాత, విరామంలో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలకు అవకాశం చాలా తక్కువ’ అని ఆయన అన్నారు.
దూరదర్శన్‌కే చాన్స్...
మనదేశంలోని ప్రముఖ ప్రసారకర్తలు జియో హాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్, సోనీ స్పోర్ట్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లతో చర్చలు నిర్వహించాలని ‘ఫిఫా’ భావిస్తోంది. ఒకవేళ ప్రసార కర్తలు ఎవరూ ముందుకు రాకపోతే... ప్రభుత్వ ప్రసారకర్త దూరదర్శన్‌లో వరల్డ్‌కప్ ప్రసారమయ్యే అవకాశముంది. 1998, 2002, 2006 ప్రపంచకప్‌లోని పలు మ్యాచ్‌లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 1998 ప్రపంచకప్ ప్రసార హక్కుల ద్వారా దూరదర్శన్ రూ. 3.5 కోట్ల లాభం కూడా పొందడం విశేషం.


