
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నారు.
311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అనూహ్య రీతిలో పుంజుకుంది. రాహుల్, గిల్, సుందర్, జడ్డూ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కడంతో 669 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.
స్టోక్స్ సరికొత్త చరిత్ర
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (141 పరుగులు, 6 వికెట్లు) ఇరగదీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శన అనంతరం స్టోక్స్ చరిత్రలో ఏ ఇంగ్లండ్ కెప్టెన్‌కు సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు.
ఈ సిరీస్‌లో స్టోక్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 300 పైచిలుకు (304) పరుగులు చేసి, 15కు పైగా (17) వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర కెప్టెన్ ఓ సిరీస్‌లో 300 ప్లస్ పరుగులు చేసి 15 ప్లస్ వికెట్లు తీయలేదు. మరో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఈ ఘనత సాధించినప్పటికీ సాధారణ ఆటగాడిగానే సాధించాడు. ఈ సిరీస్‌లో స్టోక్స్ మరో టెస్ట్ ఆడేది ఉండగా.. మరిన్ని పరుగులు, వికెట్లు తీసే అవకాశం ఉంది.
నాలుగో టెస్ట్ డ్రా అయినా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం 2-1తో కొనసాగుతూ ఉంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే.