కేటీఆర్‌ పీఏనంటూ మోసాలు.. నాగరాజుపై పీడీ యాక్ట్‌

Banjara Hills Police Registered PD Act Against EX Ranji Cricketer Nagaraju - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ పీఏనని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజుపై బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. మంత్రి కేటీఆర్‌ పేరు చెప్పి నాగరాజు నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు గతంలో ఆంధ్రప్రదేశ్‌ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014– 16 మధ్య ఏపీ రంజీ జట్టుకు ఎంపికైన బుడుమూరు నాగరాజు.. గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడ్డాడు. బీసీసీఐ మాజీ సెలక్టర్‌ ఎంఎస్కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. 

కాగా, గతేడాది ఫిబ్రవరిలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటూ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిది కార్పొరేట్‌ కంపెనీల నుంచి భారీగా దండుకున్నాడు. ఈ ఘరానా నేరగాడు నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. గతేడాది నగరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్‌ వేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కాడు. ఇటీవల ఓ ఫార్మా కంపెనీకి ఫోన్‌ చేసిన కేటీఆర్‌ పేరు చెప్పి రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇలా నాగరాజు నేరాల చిట్టా చాంతాండంత ఉంది. ఇతనిపై బంజారాహిల్స్, ఓయూ, సనత్‌నగర్‌, మాదాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతోపాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరు, న్యూఢిల్లీలలో కేసులు నమోదై ఉన్నాయి.
చదవండి: Wrestler Sushil Kumar: తీహార్‌ జైలుకు తరలింపు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top