IPL 2026: బంగ్లాదేశ్‌ యూటర్న్‌.. కీలక ప్రకటన | Bangladesh Takes U Turn lift IPL broadcast ban in country | Sakshi
Sakshi News home page

IPL 2026: బంగ్లాదేశ్‌ యూటర్న్‌.. కీలక ప్రకటన

Mar 28 2026 3:24 PM | Updated on Mar 28 2026 3:51 PM

Bangladesh Takes U Turn lift IPL broadcast ban in country

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రసారాలపై తమ దేశంలో ఎలాంటి నిషేధం లేదని ప్రకటించింది. బంగ్లాదేశ్‌ సమాచార, ప్రసార శాఖా మంత్రి జాహిర్‌ ఉద్దీన్‌ స్వపన్‌ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.

కాగా గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించాలని భారత్‌లో డిమాండ్లు రాగా.. బీసీసీఐ సానుకూలంగా స్పందించింది.

తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్‌ను తొలగించాల్సిందిగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఆదేశించింది. దీంతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) టీ20 ప్రపంచకప్‌-2026 వేదికపై అభ్యంతరం లేవనెత్తింది. భారత్‌లో కాకుండా.. పాకిస్తాన్‌ కోసం ఏర్పాటు చేసిన తటస్థ వేదికైన శ్రీలంకలోనే తాము కూడా మ్యాచ్‌లు ఆడతామని పట్టుబట్టింది.

భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ గగ్గోలు పెట్టగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో బంగ్లా వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ ప్రసారాలను బంగ్లాలో నిషేధిస్తూ అప్పటి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే, తాజాగా ఎన్నికైన ప్రభుత్వం మాత్రం భారత్‌తో స్నేహం కావాలని.. బీసీసీఐతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. క్రీడా శాఖా మంత్రి అమినుల్‌ హక్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో మంత్రి జహీర్‌ ఉద్దీన్‌ స్వపన్‌ మాట్లాడుతూ..

‘‘ఐపీఎల్‌ ప్రసారాల కోసం ఇంత వరకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. మేము రాజకీయాలు, క్రీడలను కలపాలని అనుకోవడం లేదు. వాణిజ్యపరంగా మాకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై దృష్టి సారిస్తాము.

ఏదేని చానెల్‌ ఐపీఎల్‌ ప్రసారాల కోసం అనుమతి కోరితే తప్పక సానుకూలాంగా స్పందిస్తాం. ఎవరికీ మేము అడ్డుచెప్పము. ఒకవేళ స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ను ఇక్కడ ప్రసారం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఏ చానెల్‌కైనా మేము అనుమతినిస్తాం’’ అని తెలిపాడు.

కాగా బీసీసీఐతో సంబంధాలు తెంచుకుంటే బంగ్లాదేశ్‌ బోర్డు, ఆటగాళ్లు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగి భారీ మూల్యం చెల్లించిన బంగ్లా క్రికెట్‌.. ఇకపై సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఆర్థికంగా లబ్ది పొందాలనే యోచనలో ఉంది. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందేమోనన్న భయంతో ఇలా యూటర్న్‌లు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement