
భారత యువ క్రికెటర్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) మరో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ముంబై జట్టుకు అతడు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీకి సంబంధించి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై మంగళవారం ప్రకటించింది.
జట్టులో సర్ఫరాజ్ ఖాన్
ఈ జట్టులో టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ (Musheer Khan)వంటి స్టార్లు ఉండటం విశేషం. ఇక ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఆయుశ్ మాత్రే డిప్యూటీగా సువేద్ పార్కర్ ఎంపికయ్యాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టి.. భారత జట్టు కెప్టెన్‌గా సత్తా చాటి
కాగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ నిర్వహిస్తున్నారు. దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ సీజన్ ఈ టోర్నీతోనే ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. ముంబైకి చెందిన 18 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్రంలోనే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రే 15 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 240 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. ఆయుశ్ మాత్రే అత్యుత్తమ స్కోరు 94 కావడం విశేషం. రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో కలిసి ఆయుశ్ మాత్రే కూడా ఐపీఎల్-2025లో హైలైట్‌గా నిలిచాడు.
రెండు సెంచరీలు బాదిన ఆయుశ్
ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని భారత యువ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 3-2తో గెలిచింది.
ఇక ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు బాది.. బ్యాటర్‌గానూ సత్తా చాటాడు ఆయుశ్ మాత్రే. ఈ క్రమంలో తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ఆయుశ్ మాత్రే మరోసారి సారథిగా ఎంపికయ్యాడు.
తాజాగా ముంబై జట్టుకు కూడా ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధం కావడం విశేషం. కాగా ఆగష్టు 18 నుంచి బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.
బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌కు ముంబై జట్టు ఇదే
ఆయుశ్ మాత్రే (కెప్టెన్), ముషీర్ ఖాన్, దివ్యాంష్ సక్సేనా, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్ (వైస్ కెప్టెన్), ప్రజ్ఞేష్ కాన్పిల్లెవార్, హర్ష్ అఘవ్, సాయిరాజ్ పాటిల్, ఆకాష్ పార్కర్, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గురవ్, యష్ డిచొల్కర్, హిమాన్షు సింగ్, రాయ్‌స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్.
వెస్ట్ జోన్ జట్టులోనూ సర్ఫరాజ్ ఖాన్
ఇక బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడనున్న సర్ఫరాజ్ ఖాన్ తదుపరి దులిప్ ట్రోఫీలోనూ భాగం కానున్నాడు. శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ వంటి టీమిండియా స్టార్లతో కలిసి వెస్ట్ జోన్‌కు సర్ఫరాజ్ ఖాన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.
దులిప్ ట్రోఫీ-2025లో వెస్ట్ జోన్ జట్టు
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జయమీత్ పటేల్, మనన్ హింగ్‌రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనూశ్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నగ్వాస్‌వాలా.
చదవండి: AUS vs SA: బేబీ ఏబీడీ విధ్వంసకర శతకం.. తొలి ‘ఫాస్టెస్ట్ సెంచరీ’తో..