
దులీప్ ట్రోఫీ-2025కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యా డు. అతడు కోలుకోవడానికి దాదాపు మూడు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున సర్ఫరాజ్ ఆడాల్సి ఉంది.
కానీ ఇప్పుడు గాయపడడంతో సర్ఫరాజ్ స్ధానాన్ని మరొక ప్లేయర్‌తో వెస్ట్ జోన్ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు బెంగళూరు వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్‌లో నార్త్‌జోన్‌తో వెస్ట్ జోన్ తలపడనుంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. సర్ఫరాజ్ ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్‌లో తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు.
ఆ తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ ముంబై క్రికెటర్ చేరాడు. అయితే సీఓఈ వైద్య బృందం సూచన మేరకు దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకొన్నాడు. సర్ఫరాజ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుచ్చిబాబు టోర్నీలో రెండు సెంచరీలతో మెరిశాడు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న సర్ఫరాజ్.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.
"ఇంగ్లండ్ టూర్‌కు సర్ఫరాజ్‌కు చోటు దక్కకపోయినప్పటికి.. స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌కు మాత్రం ఈ ముంబై ఆటగాడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనే అవకాశముంది. సర్ఫరాజ్‌కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. దేశవాళీ క్రికెట్‌తో పాటు భారత జట్టు తరపున కూడా అతడు సత్తాచాటాడు.
విండీస్-భారత్ మధ్య టెస్టు సిరీస్ ఆక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన జట్టును సెప్టెంబర్ నాలుగో వారంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఆ సమయానికి సర్ఫరాజ్ తన గాయం నుంచి కోలుకోకపోతే జట్టులో చోటు దక్కడం కష్టమే.
సర్ఫరాజ్ స్ధానంలో ఎవరు?
ఇక సర్ఫరాజ్ స్దానంలో వెస్ట్ జోన్ జట్టులోకి బరోడా బ్యాటర్ శివాలిక్ శర్మ వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన వెస్ట్ జోన్ రిజర్వ్ జాబితాలో శివాలిక్ శర్మ పేరు ఉంది. శివాలిక్ 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 43.48 సగటుతో 1,087 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: IPL 2026: కేకేఆర్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?