
కెప్టెన్ గిల్‌తో సర్ఫరాజ్ ఖాన్ (పాత ఫొటో)
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడే భారత్- ‘ఎ’ జట్టు (IND A vs SA A)ను ప్రకటించిన నాటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై విమర్శలు కొనసాగుతున్నాయి. రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో ఉద్దేశపూర్వకంగానే సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇంటిపేరు కారణంగానే అంటూ
సొంతగడ్డపై సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటగలడని.. అయినా అతడిని పక్కనపెట్టడం ఏమిటని మాజీ క్రికెటర్లు సైతం విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేత షామా మొహమ్మద్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్‌పై వేటు వేశారంటూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
గజ్జల్లో గాయం
ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించినట్లు ఎన్‌డీటీవీ తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్‌ను భారత్- ‘ఎ’ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణం వెల్లడించినట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘సర్ఫరాజ్ గజ్జల్లో గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే రంజీ ట్రోఫీ మొదటి రౌండ్ సందర్భంగా ముంబై తరఫున కాంపిటేటివ్ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు.
త్వరలోనే తిరిగి జట్టులోకి
రంజీ తాజా సీజన్‌లో అతడి ప్రదర్శన, ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో అంచనా వేసిన తర్వాతే అతడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయలేదు. త్వరలోనే తిరిగి అతడు జట్టులోకి వస్తాడని నమ్ముతున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఎన్‌డీటీవీ తెలిపింది.
కాగా స్వదేశంలో దేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో ఈనెల 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్‌క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్‌లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ.
పంత్ రీఎంట్రీ
బెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తేదీలను దృష్టిలో ఉంచుకుంటూ ఆయా ఆటగాళ్ల అందుబాటును బట్టి జట్లను ఎంపిక చేశారు.
కాగా ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో పేసర్ క్రిస్ వోక్స్ బంతి బలంగా తగలడంతో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో చివరి టెస్టు నుంచి తప్పుకున్న అతడు ఆ తర్వాత ఆసియా కప్ టీ20 టోర్నీ, వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
చికిత్స అనంతరం కోలుకున్న పంత్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం ఇటీవలే సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో అతడిని ముందుగా ‘ఎ’ జట్టు తరఫున ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు.
అన్నీ సానుకూలంగా ఉంటే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం పంత్‌ను ఎంపిక చేయడం లాంఛనమే. పంత్‌తో పాటు యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించి అతడిని రెండు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు.
దేశవాళీలో రాణిస్తూ ఫామ్‌లో ఉన్న రజత్ పాటీదార్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్‌దీప్‌లను రంజీ కారణంగా ఒకే మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. మరోవైపు టెస్టు సిరీస్‌కు ముందు తమ ఆటకు పదును పెట్టాలని భావిస్తున్న రెగ్యులర్ టెస్టు జట్టు సభ్యులు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురేల్ కూడా రెండో మ్యాచ్‌లో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతారు.
భారత్ ‘ఎ’ జట్టు (తొలి మ్యాచ్‌కు):
రిషభ్ పంత్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ మాత్రే, జగదీశన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుశ్ బదోని, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్.
భారత్ ‘ఎ’ జట్టు (రెండో మ్యాచ్‌కు):
పంత్ (కెప్టెన్), సాయిసుదర్శన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్.
చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?