ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?.. మాజీ క్రికెటర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Congress Leader Shama Mohamed Slammed Over Sarfaraz Khan Claim | Sakshi
Sakshi News home page

ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా గంభీర్‌?.. కాంగ్రెస్‌ నేతపై నెటిజన్ల మండిపాటు

Oct 22 2025 3:52 PM | Updated on Oct 22 2025 4:43 PM

Congress Leader Shama Mohamed Slammed Over Sarfaraz Khan Claim

సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్‌- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా సాయి సుదర్శన్‌ (Sai Sudharsan)ను ఎంపిక చేశారు సెలక్టర్లు.

కావాల్సినంత ప్రాక్టీస్‌
అదే విధంగా రెండో అనధికారిక టెస్టులో కేఎల్‌ రాహుల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ వంటి టీమిండియా స్టార్లకు కూడా చోటిచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉండే ఈ రెడ్‌బాల్‌ సిరీస్‌తో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్‌ దొరకనుంది.

పక్కనపెట్టడంపై విమర్శలు
ఇక ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌కు ప్రధాన జట్టులో స్థానం దక్కదనే స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలే పదిహేడు కిలోల బరువు తగ్గడంతో పాటు రెడ్‌ బాల్‌ టోర్నీల్లో సెంచరీ చేసినా సెలక్టర్లు అతడిని ఇలా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత షామా మొహమ్మద్‌ సంచలన ట్వీట్‌ చేశారు.

ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?
‘‘ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్‌ ఖాన్‌ జట్టుకు ఎంపిక కాలేదా?.. ఊరికే అడుగుతున్నా అంతే!.. ఈ విషయంలో గౌతం గంభీర్‌ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!’’ అంటూ హెడ్‌కోచ్‌, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్‌ను షామా మొహమ్మద్‌ టార్గెట్‌ చేశారు.

కరెక్ట్‌ కాదు మేడమ్‌..
ఈ నేపథ్యంలో షామా ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, మెజారిటీ మంది ఆమె ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నారు. మొహమ్మద్‌ సిరాజ్‌ జట్టులోని ప్రధాన బౌలర్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని.. ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడటం సరికాదని పేర్కొంటున్నారు.

భారత క్రికెట్‌లో ఎప్పుడూ ఇలా జరుగలేదు
ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్‌ అతుల్‌ వాసన్‌.. షామా మొహమ్మద్‌ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విషాదకరం. ఇలాంటి మాటలు వద్దు. సర్ఫరాజ్‌ ఖాన్‌ జట్టులో ఉండేందుకు అర్హుడు.

అయితే, అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలు అర్థంలేనివి. భారత క్రికెట్‌లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అజర్‌ హయాంలోనూ కొందరు ఇలాంటి మాటలే మాట్లాడారు.

కానీ ఇందులో మతపరమైన కోణం ఉంటుందని నేను అస్సలు అనుకోను. సర్ఫరాజ్‌ ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక కాలేడు. చాన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.

సర్ఫరాజ్‌కు తగినన్ని ఛాన్సులు రాలేదు.. కానీ
అయితే, ఓ ప్లేయర్‌ ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టడం సరికాదు. సర్ఫరాజ్‌ ఖాన్‌కు తగినన్ని ఛాన్సులు రాలేదు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్‌ పంత్‌.. తర్వాత విఫలమైనా అతడిని పక్కనపెట్టడం జరగదు.

జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ఎవరూ మార్చలేరు’’ అని అతుల్‌ వాసన్‌ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి ఓ సెంచరీ, మూడు అర్థ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. 

రోహిత్‌ లావుగా ఉన్నాడని..
కాగా షామా మొహమ్మద్‌ గతంలోనూ రోహిత్‌ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్‌ లావుగా ఉన్నాడని.. అదృష్టం కొద్దీ కెప్టెన్‌ అయ్యాడే తప్ప అతడికి అంత సీన్‌ లేదని వ్యాఖ్యానించారు. కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 రూపంలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత రోహిత్‌ శర్మది.

చదవండి: ఓపెనర్‌గానూ రోహిత్‌ శర్మపై వేటు!?.. గంభీర్‌, అగార్కర్‌ చర్య వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement