ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా

Australia Won The Match By 12 Runs In 3rd T20 - Sakshi

సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది.187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 85 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ ఎవరు చెప్పుకోదగిన విధంగా ఆడలేకపోయారు. ఆసీస్‌ విధించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌  ఆదిలోనే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కోల్పోయింది.  స్కోరు బోర్డుపై పరుగులేమి రాకుండానే మాక్సవెల్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి ఓపెనర్‌ ధవన్‌తో కలిసి రన్‌రేట్‌ పడిపోకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం  చేశాడు.

ఈ నేపథ్యంలో 28 పరుగులు చేసిన ధవన్‌ స్వేప్సన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శామ్సన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లాస్ట్‌ మ్యాచ్‌ హీరో పాండ్యా కోహ్లికి జత కలిశాడు. ఒకపక్క కోహ్లి సిక్సర్లు, ఫోర్లతో విజృంభించడం.. పాండ్యా కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు అంతకంతకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే 20 పరుగులు చేసిన పాండ్యా జంపా బౌలింగ్‌లో అవుట్‌గా వెనుదిరగడం.. ఆ తర్వాత కాసేపటికే కోహ్లి కూడా అండ్రూ టై బౌలింగ్‌లో అవుట్‌ కావడంతో భారత్‌ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ రెండు సిక్సర్లు బాదినా అవి లక్ష్యాన్ని తగ్గించడానికి మాత్రమే పనిచేసింది. అలా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్వేపన్‌ 3, మ్యాక్స్‌వెల్‌, అండ్రూ టై, జంపా, అబాట్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకొని ఆసీస్‌ను‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ రెండో ఓవర్‌ వేసిన వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు.ఫించ్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్‌ వేడ్‌ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్‌ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్‌  79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన వేడ్‌.. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మ్యాక్స్‌వెల్‌ కూడా బ్యాట్‌కు పనిజెప్పడంతో ఆసీస్‌కు పరుగులు వేగంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్‌ కూడా 30 బంతుల్లో టోర్నీలో తొలి ఫిప్టీ సాధించాడు. అయితే స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్‌, మ్యాక్స్‌వెల్‌ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. టీమిండియా బౌలర్లలో  సుందర్‌ 2, నటరాజన్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top