Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి..

Asia Cup: Afghanistan Enters Super 4 Mosaddek Says Next Match Do Or Die For Us - Sakshi

Asia Cup 2022 Bangladesh vs Afghanistan: ఆసియా కప్‌-2022 టోర్నీలో అఫ్గనిస్తాన్‌ అదరగొడుతోంది. ఈ మెగా ఈవెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన నబీ బృందం... మంగళవారం(ఆగష్టు 30) బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. షార్జా వేదికగా సాగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

తద్వారా గ్రూప్‌- బి టాపర్‌గా నిలిచి సూపర్‌ 4కు అర్హత సాధించింది. మరోవైపు.. బంగ్లాదేశ్‌.. శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిస్తే తప్ప రేసులో నిలవలేని పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ చేతిలో ఓటమి అనంతరం బంగ్లా ఆల్‌రౌండర్‌ ముసాదిక్‌ హొసేన్‌ మాట్లాడుతూ.. తమ జట్టు కనీసం 140 పరుగులు నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఘోర ఓటమి కారణంగా తదుపరి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోక తప్పని స్థితికి చేరుకున్నామని పేర్కొన్నాడు.

ఈ మేరకు హొసేన్‌ మాట్లాడుతూ.. ‘‘టీ20 మ్యాచ్‌లలో ఆరంభంలోనే అంటే పవర్‌ ప్లేలో రెండు, మూడు వికెట్లు కోల్పోయామంటే పరిస్థితులు కఠినంగా మారతాయి. ఒకవేళ మేము 140 పరుగులైనా చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారింది. తదుపరి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ రాణిస్తే బాగుండేది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా సెప్టెంబరు 1న శ్రీలంకతో బంగ్లాదేశ్‌ తమ తదుపరి మ్యాచ్‌ ఆడనుంది. ఇక బంగ్లాదేశ​ ఇటీవలి కాలంలో వెస్టిండీస్‌, జింబాబ్వేతో వరుసగా టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మరోవైపు.. ఐర్లాండ్‌కు టీ20 సిరీస్‌ కోల్పోయి.. ఆ వెంటనే యూఏఈకి చేరుకున్న అఫ్గనిస్తాన్‌ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో వరుస విజయాలు నమోదు చేయడం విశేషం.

మ్యాచ్‌ ఇలా సాగింది( Afghanistan Beat Sri Lanka By 7 Wickets)
అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అఫ్గన్‌ బౌలర్లు ముజీబ్‌ వుర్‌ రహ్మాన్‌ (3/16), రషీద్‌ ఖాన్‌ (3/22) స్పిన్‌ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇద్దరూ కలిసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత  20 ఓవర్లలో షకీబ్‌ అల్‌ హసన్‌ బృందం.. ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆల్‌రౌండర్‌ ముసాదిక్‌ హొసేన్‌(31 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే రాణించాడు. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసి కష్టాల్లో పడింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను తమవైపు తిప్పేశాడు. ఇక ఇబ్రహీమ్‌ (41 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు చేసి అఫ్గన్‌ను గెలిపించాడు.   బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించిన ముజీబ్‌ వుర్‌ రహ్మాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Asia Cup 2022 IND Vs HK: హాంకాంగ్‌తో మ్యాచ్‌.. భారీ విజయమే లక్ష్యంగా
AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top