
గిల్- సంజూ (PC: BCCI)
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. టాపార్డర్‌లో విశ్వరూపం ప్రదర్శించే సంజూ శాంసన్ (Sanju Samson)ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెనర్‌గా తప్పించవద్దని జట్టు యాజమాన్యానికి సూచించాడు.
వైస్ కెప్టెన్ అయినప్పటికీ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సంజూను రీప్లేస్ చేయలేడని.. అతడు వేరొక స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది.
వైస్ కెప్టెన్‌గా..
ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి గిల్‌కు పిలుపునిచ్చిన మేనేజ్‌మెంట్.. అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో గిల్ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.
గిల్ లేనందు వల్లే సంజూ ఓపెనింగ్ చేశాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఓపెనర్‌గా అభిషేక్ శర్మ పాతుకుపోయాడంటూ కితాబులు ఇవ్వడం ద్వారా.. అభి- గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే సంకేతాలు ఇచ్చాడు.
ప్రమాదకర బ్యాటర్
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాత్రం సంజూ శాంసన్‌కే తన మద్దతు అంటూ కుండబద్దలు కొట్టేశాడు. ‘‘టాపార్డర్‌లో అత్యంత ప్రమాదకర బ్యాటర్ సంజూ శాంసన్. అక్కడ ఆడిస్తేనే మనకోసం మ్యాచ్‌లు గెలవగలడు. కాబట్టి తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చకూడదు.
సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులువేం కాదు. టాప్ ఆర్డర్‌లో టీమిండియా తరఫున టీ20లలో సంజూకు మంచి రికార్డు ఉంది. గిల్ కూడా అతడిని డిస్‌ప్లేస్ చేయలేడు. కాబట్టి గిల్ వేరొకరి స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచిది.
సంజూనే సరైనోడు
సంజూ శాంసనే ఓపెనర్‌గా ఉండాలి. టీ20 ఫార్మాట్లో తనకు ఉన్న రికార్డును బట్టి సంజూనే సరైనోడు. టాప్‌లో రాణిస్తూ పరుగులు రాబట్టడంతో పాటు సెంచరీలు కూడా చేసిన ఘనత అతడిది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
కాగా రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలోనే సంజూ టీమిండియాలో పునరాగమనం చేశాడు. అయితే, అతడికి వరుస అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో టీ20 ప్రపంచకప్-2021 జట్టులోనూ చోటు దక్కలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో స్థానం దక్కినప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
జితేశ్ శర్మతో పోటీ
ఇక గిల్ రాకతో ఆసియా కప్ టోర్నీలో కేవలం వికెట్ కీపర్ కోటాలొ సంజూ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అక్కడ కూడా జితేశ్ శర్మతో అతడికి పోటీ తప్పదు. జితేశ్ స్పెషలైజ్డ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మేనేజ్‌మెంట్ అతడి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో 42 టీ20 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. మూడు శతకాల సాయంతో 861 పరుగులు చేశాడు.
చదవండి: అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయరు?