
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో (India vs Australia) టీమిండియా 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. 17 ఏళ్ల తర్వాత అడిలైడ్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి (వన్డేల్లో).
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఓటమిపై స్పందిస్తూ ఇలా అన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి డీసెంట్ స్కోర్ చేశాం. అయితే కొన్ని క్యాచ్‌లు వదిలేయడం వల్ల ఆ స్కోర్‌ను కాపాడుకోలేకపోయాం.
ప్రారంభంలో పిచ్ ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందించింది. 15–20 ఓవర్ల తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.
మొదటి మ్యాచ్‌లో టాస్ చాలా కీలకమైంది. వర్షం ప్రభావం ఉన్నందున అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. అయితే రెండో మ్యాచ్‌లో టాస్ ప్రభావం పెద్దలా లేదు. ఇరు జట్లు దాదాపు 50 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి.
రోహిత్ శర్మపై ప్రశంసలు
ఏడు నెలల గ్యాప్ తర్వాత మునుపటి తరహాలో ఆడటం అంత ఈజీ కాదు. అయినా రోహిత్ ధైర్యంగా ఆడి, అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను భారీ స్కోర్ మిస్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో వీరోచితంగా పోరాడాడు. రోహిత్ బ్యాటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా.. రోహిత్ (73), శ్రేయస్ (61), అక్షర్ (44) బాధ్యతాయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.
ఛేదనలో ఆస్ట్రేలియా కూడా తడబడినప్పటికీ.. అంతిమంగా విజయం సాధించింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోల్నీ (61 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో షార్ట్‌కు రెండు లైఫ్‌లు లభించాయి.
కీలక సమయాల్లో అక్షర్ పటేల్, సిరాజ్ ఈజీ క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఈ క్యాచ్‌లే మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చాయి. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న జరుగనుంది.
చదవండి: ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్