
అభిషేక్ శర్మ- ప్రియాన్ష్ ఆర్య (PC: IPL/BCCI)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఘనత టీమిండియా సొంతం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో 2007లో పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత దాదాపు పదిహేడేళ్లకు అంటే.. 2024లో మరోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది భారత్.
రో- కో గుడ్‌బై చెప్పిన తర్వాత
అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా గతేడాది ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి కప్‌ను గెలుచుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma).. టీమిండియా విజయం తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
అభి- సంజూ జోడీ హిట్
ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేయగా.. భారత టీ20 జట్టు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ నిలదొక్కుకున్నారు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ టెస్టులతో బిజీ కావడంతో ఈ జోడీకి వరుస అవకాశాలు వచ్చాయి.
అయితే, ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా టీమిండియా ఓపెనర్లు మారే అవకాశం ఉంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి ప్రకటించిన జట్టులో గిల్ స్థానం దక్కించుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ టెస్టు కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు.
స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే
జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలను బట్టి.. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఖరారు అయినట్లే. అతడికి జోడీగా సంజూను కాదని గిల్‌ను పంపే అవకాశాలే ఎక్కువ. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ప్రకటించిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కనే లేదు. అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు.
ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లు
ఇక టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్-2025 టోర్నీతో అభిషేక్- గిల్ టీమిండియా ఓపెనింగ్ జోడీగా దాదాపు ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సురేశ్ రైనా మాత్రం భిన్నంగా స్పందించాడు. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లు చెప్పాడు.
ప్రియాన్ష్ ఆర్య కూడా ఓ ఆప్షన్!
శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి యశస్వి ఓ ఓపెనర్‌గా ఉండొచ్చు. అంతేకాదు ప్రియాన్ష్ ఆర్యపై కూడా సెలక్టర్లు దృష్టి సారించవచ్చు. ఇక అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఉండనే ఉన్నారు.
ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో ఉండవచ్చు. అయితే, నా మొదటి ప్రాధాన్యం మాత్రం అభిషేక్ శర్మకే. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడుకాడని చెప్పేందుకు పెద్ద కారణాలు లేవు’’ అని రైనా పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన ప్రియాన్ష్ ఆర్య 17 మ్యాచ్‌లలో కలిపి 475 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం.
చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు!