‘హ్యాట్రిక్’ విజయంతో లీగ్ దశ ముగింపు
జోర్డాన్‌పై 3–1తో అర్జెంటీనా గెలుపు
ప్రపంచకప్‌లో మెస్సీ 19వ గోల్
డాలస్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన అర్జెంటీనా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది. జోర్డాన్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘జె’ చివరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–1తో గెలిచింది. అర్జెంటీనా తరఫున జియోవాని సెల్సో (19వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (31వ నిమిషంలో), లియోనెల్ మెస్సీ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జోర్డాన్ తరఫున మూసా అల్తమారి (55వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన అర్జెంటీనా తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘జె’ టాపర్‌గా నిలిచింది.
ఈ టోర్నీలో మెక్సికో, ఫ్రాన్స్ తర్వాత గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మూడో జట్టుగా అర్జెంటీనా ఘనత వహించింది. అంతేకాకుండా అర్జెంటీనా ఐదోసారి ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో నెగ్గింది. బ్రెజిల్, జర్మనీ జట్ల తర్వాత ప్రపంచకప్‌లో 50 విజయాలు సాధించిన మూడో జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. శనివారం జరిగే నాకౌట్ దశ మ్యాచ్‌లో కేప్ వెర్డె జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది.
నాకౌట్ బెర్త్ ముందే ఖరారు కావడంతో జోర్డాన్‌తో మ్యాచ్‌లో కెపె్టన్ మెస్సీ 60వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. 80వ నిమిషంలో గోల్ సాధించాడు. తద్వారా వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో మెస్సీకిది 19వ గోల్ కావడం విశేషం.
పోర్చుగల్, కాంగో కూడా...
గ్రూప్ ‘కె’ నుంచి క్రిస్టియానో రొనాల్లో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు... 52 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన కాంగో జట్టు కూడా నాకౌట్ బెర్త్‌లు సాధించి ముందంజ వేశాయి. వరుసగా రెండు విజయాలు సాధించి ఇప్పటికే నాకౌట్ దశకు చేరిన కొలంబియా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌ను పోర్చుగల్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. మరో మ్యాచ్‌లో కాంగో జట్టు 3–1తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచింది.
గ్రూప్ ‘కె’లో 7 పాయింట్లతో కొలంబియా తొలి స్థానంలో, 5 పాయింట్లతో పోర్చుగల్ రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా కాంగో జట్టు నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈసారి ప్రపంచకప్‌లలో ఆఫ్రికా నుంచి 10 దేశాలు పాల్గొనగా... ఏకంగా 8 దేశాలు నాకౌట్ దశకు అర్హత పొందడం విశేషం.
‘డ్రా’తో ఆస్ట్రియా, అల్జీరియా ముందుకు...
గ్రూప్ ‘జె’లో భాగంగా అల్జీరియా, ఆ్రస్టియా మధ్య జరిగిన మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఈ ఫలితంతో ఆస్ట్రియా, అల్జీరియా నాలుగు పాయింట్లతో సమంగా నిలిచాయి. గోల్స్ అంతరంతో ఆస్ట్రియా గ్రూప్ ‘జె’లో రెండో స్థానంతో నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అల్జీరియా ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను సంపాదించింది. గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌కు చేరిన క్రొయేషియా జట్టు... నాకౌట్ బెర్త్ పొందాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటుకుంది.

ఘనా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎల్’ మ్యాచ్‌లో క్రొయేషియా 2–1తో విజయం సాధించింది. గ్రూప్ ‘ఎల్’లోని మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ 2–0తో పనామా జట్టును ఓడించింది. గ్రూప్ ‘ఎల్‌లో ఇంగ్లండ్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో, క్రొయేషియా 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఘనా జట్టు ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.


