షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్న భారత్‌, పాక్‌ క్రికెటర్లు | Amid rising tensions, India and Pakistan women’s blind teams share post match handshake | Sakshi
Sakshi News home page

షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్న భారత్‌, పాక్‌ క్రికెటర్లు

Nov 17 2025 5:03 PM | Updated on Nov 17 2025 5:44 PM

Amid rising tensions, India and Pakistan women’s blind teams share post match handshake

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాక్‌ (India vs Pakistan) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. క్రికెట్‌లో అయితే ఇరు దేశాల జట్లు కనీసం షేక్‌ ఇచ్చుకోవాడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ 'నో హ్యాండ్‌ షేక్‌' ఆనవాయితీని ముందుగా టీమిండియా మొదలుపెట్టింది. ఆసియా కప్‌-2025లో పాక్‌తో తలపడిన మూడు సందర్భాల్లో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు.

ఇదే తంతు మహిళల వన్డే ప్రపంచకప్‌, నిన్న జరిగిన ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2025 టోర్నీలోనూ కొనసాగింది. అయితే భారత అంధుల మహిళా క్రికెట్‌ జట్టు మాత్రం ఈ ఆనవాయితీకి పుల్‌స్టాప్‌ పెట్టింది.

నిన్న కొలొంబోలో (శ్రీలంక) జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌-2025లో భారత్‌, పాక్‌ ఎదురెదురుపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్‌ అనంతరం భారత ప్లేయర్లు క్రీడాస్పూర్తిని చాటుకుంటూ.. పాక్‌ ప్లేయర్లకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. 

ఈ ఉదంతం ప్రస్తుతం భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అన్ని విభాగాలకు చెందిన భారత జట్లు పాక్‌ ప్లేయర్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరిస్తుంటే.. అంధుల జట్టు ఇలా చేసిందేంటని చాలామంది అభిమానులు కోప్పడుతున్నారు. కొందరేమీ ఇది శుభపరిణామమే అని అంటున్నారు. అయితే ఇదే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు భారత్‌, పాక్‌ కెప్టెన్లు హ్యాండ్‌ షేక్‌ ఇచ్చుకోకపోవడం గమనార్హం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 135 పరుగులకే ఆలౌటైంది. మెహ్రీన్ అలీ(66), బుష్రా అష్రఫ్(44) రాణించడంతో పాక్‌ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చెలరేగిపోయారు. ఏకంగా ఏడుగురు పాక్‌ ప్లేయర్లను రనౌట్‌ చేశారు.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌ పాక్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపికా టీసీ (45), అనెఖా దేవి (64 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు సునాయాస విజయాన్నందించారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో భారత్‌ సెమీఫైనల్‌కు కూడా చేరింది.

చదవండి: పాక్‌ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్‌ సూర్యవంశీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement