
సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కానీ, ఒక చిరునవ్వు కానీ వివాదానికి, అనవసరపు చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే కావచ్చు అటు సూర్యకుమార్ యాదవ్ గానీ ఇటు సల్మాన్ ఆగా కానీ అందుకు సాహసించలేదు. ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకుండా, కనీసం ఒకరివైపు మరొకరు చూడకుండా ఇద్దరూ చెరో వైపునకు వెళ్లిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా వెళ్లిపోయారు.
టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీకి సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మన అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఆ ఒక్క విజువల్‌ను మళ్లీ మళ్లీ చూపిస్తూ సోషల్ మీడియాలో అంతా సూర్యను, బీసీసీఐని ఆడుకున్నారు. దాంతో ఈసారి అతను కూడా జాగ్రత్త పడ్డాడు!