
భారత్-పాక్ ఆటగాళ్ల హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్ చేసింది. జట్టు క్రికెట్ ఆపరేషన్ష్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్ చేశాడని తెలుస్తుంది.
ఈ విషయాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్ ముందు పాక్ పరువు పోయింది. టాస్‌కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం.
కాగా, ఆసియా కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్-4 దశ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్‌షేక్ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.
ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది.