రోహిత్‌ ఉన్న ప్రతీసారి గెలిచారు.. కానీ ధోని లేడు!

1st time In Final MI Will Not Be Up Against Dhoni In Opposite Camp - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్ల విజేత ముంబై ఇండియన్స్‌ మరో ఫైనల్స్‌కు సిద్ధమైంది. తొలి క్వాలిఫయర్‌లో ఎదురు పడిన ఢిల్లీని చితగ్గొట్టి, పడగొట్టి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు) విరుచుకు పడ్డాడు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేయడంతో ఢిల్లీ చిత్తుగా ఓడింది. బుమ్రా విజృంభణకు బౌల్ట్‌ కూడా రాణించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. (ఐపీఎల్‌ 2020: ‘భారత్‌’ రికార్డు)

ఆరోసారి టైటిల్ ఫైట్ సిద్దమైన ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఐదు ఫైనల్స్ ఆడగా.. నాలుగింటిలో గెలుపొందింది. 2010లో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2013, 2015, 2017, 2019 సీజన్లలో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఇప్పటి వరకూ ఆ జట్టు ఫైనల్ చేరిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టులో ధోని ఉండటం విశేషం. 2017 సీజన్‌లో సీఎస్‌కే ఆడకపోయినప్పటికీ,  పుణె సూపర్ జెయింట్స్ తరఫున ధోని ఫైనల్ ఆడాడు. స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని పుణే జట్టును ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో ఓడించి కప్ గెలిచింది. అయితే ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమించడంతో.. ఈ సీజన్లో రోహిత్ సేన..  ప్రత్యర్థి స్థానంలో ధోని లేకుండా ఫైనల్ ఆడనుంది. అయితే రోహిత్ సారథ్యంలో ఫైనల్‌కు వెళ్లిన ప్రతీసారి ధోనీ జట్టుపై విజయం సాధించి టైటిల్ నెగ్గిన ముంబై..  2010లో మాత్రం సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో ఓడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top