ఇంటింటికీ సర్ వస్తున్నారు..
రాజకీయ పార్టీలు సహకరించాలి
జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి జూలై 24వరకు సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాలి. ప్రక్రియ విజయవంతం కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాం. ఆయా రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వయంతో పనిచేసి కచ్చితత్వమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం సహకరించాలి. అదేవిధంగా అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
–హైమావతి, కలెక్టర్
సిద్దిపేటజోన్: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలుకానుంది. బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌ఓ) సమగ్ర వివరాలను సేకరించడానికి ఇంటింటి బాట పట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుంది. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి వాటిలో సమగ్ర వివరాలను పొందుపర్చి స్వీకరిస్తారు. రికార్డుల ప్రకారం జిల్లాలో 9.94.357 మంది ఓటర్లు ఉండగా వారిలో 4.85.859 మంది పురుషులు, 5.08.514మంది మహిళలు, 84 ఇతరులు ఉన్నారు. అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, అదేవిధంగా మరణించిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నకిలీ ఓట్లను తొలగించే లక్ష్యంగా సర్ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్ల జాబితా 2002కు అనుగుణంగా ప్రస్తుత వివరాలు సేకరిస్తారు. సేకరించిన సమాచారం ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో జూలై 31నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలను స్వీకరిస్తారు. అక్టోబర్1న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.
సర్వే కోసం 1,314 మంది..
నేటి నుంచే జిల్లాలో ఓటర్ల సమగ్ర సర్వే
వచ్చే నెల 24వరకు ప్రక్రియ
ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ
1,314 సిబ్బంది నియామకం
జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి సర్వే కోసం 1,314 మంది సిబ్బందిని నియమించారు. వీరికి ఇటీవల శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేయనున్నారు. వాటిలో ప్రధానంగా మూడు భాగాల్లో వివరాలు అందించాల్సి ఉంది. ఓటరు వివరాలు ఉంటే దానికి సంబంధించిన ఫొటో అతికించడం, 2002 నాటికి ఓటు లేనిచో వారి కుటుంబీకుల వివరాలు పొందుపరచడం, మూడో విభాగంలో పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్ లాంటి సమగ్ర వివరాలను పొందుపరిచేలా సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ ఆఫీసర్లు సేకరించనున్నారు.


