నీటి పన్ను లెక్కల్లో
చెల్లింపుల రశీదులున్నా.. రికార్డుల్లో బకాయిలు
మున్సిపల్ కార్యాలయ భవనం
హుస్నాబాద్: నీటి పన్నుల లెక్కల్లో గోల్‌మాల్ జరుగుతోంది. చెల్లింపుల రశీదులున్నా.. రికార్డుల్లో మాత్రం బకాయిలుగా ఉండటం విచిత్రం. హుస్నాబాద్ మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారులకు శాపంగా మారింది. ఇంటి పన్నుల బకాయిలు రూ.లక్షల్లో చూశాం.. నల్లా పన్నుల బకాయిలు సైతం రూ. కోట్లల్లో ఉండటం ఈ ఒక్క మున్సిపాలిటిల్లోనే చూస్తున్నాం.
మున్సిపాలిటీలో7,454 ఇళ్లు..
హుస్నాబాద్ మున్సిపాలిటీలో 7,454 ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికీ భగీరథ నల్లా కనెక్షన్ ఉంది. మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారం నల్లా పన్నులు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ, మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ వరకు దాదాపు మ్యాన్‌వల్ ద్వారా నల్లా పన్నులు వసూలు చేశారు. గ్రేడ్–3 మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఆన్‌లైన్ చేస్తున్నా, దాదాపు 60 నుంచి 70 శాతం వరకు రశీదులు ఇస్తున్నారు. ఎవరైనా అవసరం నిమిత్తం మున్సిపల్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ కావాలని వెళ్తే ఇంటి పన్నులు, నల్లా పన్నులు చెల్లించాలని కోరుతున్నారు. నల్లా బిల్లులు చెల్లించినట్లుగా రశీదులను చూపిస్తున్నా.. రికార్డుల్లో బకాయి ఉన్నట్లుగా చూపెడుతుండటంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.
ఆధారం లేకపోతే చెల్లించాల్సిందే..
దాదాపు పదేళ్లుగా ఽనల్లా బిల్లులు చెల్లించామని, ఆధారం చూపి బిల్లులను ఆన్‌లైన్‌లో అడ్జెస్ట్‌మెంట్ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్ కలెక్టర్లు వసూలు చేసిన డబ్బులను మున్సిపల్ అకౌంట్‌లో జమ చేసినట్లుగా చూపించాల్సి ఉంటుంది. సిబ్బంది మాత్రం మాకేందుకు ఈ రిస్క్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది అమాయకులైన నిరక్షరాస్యులు బిల్లులు పొగొట్టుకున్నామని చెబితే, మా వద్ద ఎలాంటి రికార్డులు లేవని అధికారులు చెబుతుండటం గమనార్హం. కొంత మంది తప్పనిపరిస్థితుల్లో మళ్లీ నల్లా పన్నులు చెల్లించి నష్టపోతున్నారు. నల్లా పన్నులు వసూలు చేసిన సిబ్బంది వినియోగించిన రశీదు బుక్స్ నకిలీవా? ఒరిజినలా? అనేది సందేహం కలుగుతోంది. లక్షలాది రూపాయలు ఎటు పోయినట్లు? మున్సిపల్‌కు జమ చేశారా? సిబ్బందే జేబులు నింపుకొన్నారా? అనేది ఉన్నతాధికారులు విచారణ చేస్తేనే ఇంటి పన్నుల వ్యవహారం బయట పడుతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
అధికారి ఇచ్చిన రశీదు..
అధికారుల నిర్లక్ష్యం..వినియోగదారులకు శాపం
బిల్లు బుక్స్ అసలివా?.. నకిలీవా?
హుస్నాబాద్ మున్సిపాలిటీలోగందరగోళం


