ఎరువుల డీలర్‌కుషోకాజ్‌ నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

ఎరువుల డీలర్‌కుషోకాజ్‌ నోటీస్‌

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండల పరిధి గౌరవెల్లిలోని అరవింద ఫర్టిలైజర్‌ దుకాణ డీలర్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. సదరు డీలర్‌ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం వ్యవసాయ అధికారి(ఏఓ) తస్లీమా సుల్తానా ఎరువుల దుకాణాన్ని సందర్శించి షోకాజ్‌ నోటీసు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎరువుల దుకాణంలోని స్టాక్‌ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, విక్రయ విధానాలను పరిశీలించామన్నారు. ఎమ్మార్పీ ప్రకారమే విక్రయించాలని, నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించరాదని హెచ్చరించామన్నారు. ఎరువుల వ్యాపారాన్ని యాక్ట్‌ ప్రకారం నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో

విలీనం చేయాల్సిందే

హుస్నాబాద్‌: మొదటి ప్రాధాన్యతగా అర్టీసీని ముందుగా ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం. ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం డిపో టీఎంయూ నూతన కమిటీ డిపో మేనేజర్‌తో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఏ విధమైన ఎన్నికలు లేకుండా ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్‌ డేట్‌ను ప్రకటించాలన్నారు. లేనిపక్షంలో రిటైర్మెంట్‌ అయ్యే వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. రిటైర్మెంట్‌ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో రీజినల్‌ కార్యదర్శి ఏవీఆర్‌ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ప్రతిష్ఠాపన మహోత్సవం

గజ్వేల్‌: సింగాటం గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటల పండాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎ్‌స్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్షాల కోసం పూజలు

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని గోనెపల్లిలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని బుధవారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురిపించాలని వరుణుడిని వేడుకున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. పూజల్లో సర్పంచ్‌ మధుసూదన్‌ రెడ్డి, నాయకులు కమలాకర్‌ చారి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement