పట్టణాలు మురిసేనా? | - | Sakshi
Sakshi News home page

పట్టణాలు మురిసేనా?

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

కూడళ్లు మెరిసేనా?
‘సుందరీకరణ’కు గ్రహణం వీడేనా?

జిల్లాలోని మున్సిపాలిటీల్లో సుందరీకరణ పనులు ఈసారైనా ముందుకు సాగేనా..? అనే చర్చ సాగుతోంది. గతంలో నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో ల్యాప్స్‌ అయ్యాయి. తాజాగా మున్సిపాలిటీలకు మంజూరైన టీయూఎఫ్‌ఐడీసీ(తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నిధులతో ఈ పనులు చేపట్టే అవకాశం ఉండగా.. పాలకవర్గాల చొరవపైనే ఆశలు నెలకొన్నాయి. – గజ్వేల్‌

మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన సుందరీకరణ పనులకు ఏళ్ల తరబడి ఏదో అంశం అడ్డంకిగా మారుతోంది. ఫలితంగా గతంలో మంజూరైన నిధులు ల్యాప్స్‌ కావడంపై చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో సుందరీకరణలో భాగంగా నాలుగేళ్ల క్రితం మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్‌ ఫౌంటేన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్‌ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో ‘గడా’ (గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ద్వారా రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రజ్ఞాపూర్‌ చౌరస్తా, పిడిచెడ్‌ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్‌ సర్కిల్‌, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్‌ రోడ్డు చౌరస్తా, తూప్రాన్‌ రోడ్డులోని బాబుజగ్జీవన్‌రామ్‌ వై జంక్షన్‌, ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ వద్ద గల సర్కిల్‌, ముట్రాజ్‌పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిద్దిడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్‌ చౌరస్తా, బాబూజగ్జీవన్‌రాం చౌరస్తా, ముట్రాజ్‌పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేసి, మిగతా పనులను చేపట్టకుండా చేతులు దులుపుకొన్నారు. వచ్చిన నిధుల్లో పావువంతుకుపైగా మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన ల్యాప్స్‌ అయ్యాయి.

నిధులు మంజూరుతో..

గతంలో పనులు చేపట్టకపోవడంతో నిధులు ల్యాప్స్‌

ఇటీవల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు మంజూరు

పాలకవర్గాల చొరవపైనే ఆశలు

జిల్లాలోని మున్సిపాలిటీల తీరు

జిల్లాలోని మున్సిపాలిటీల సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా నిధులు వచ్చాయి. ఇందులో గజ్వేల్‌, సిద్దిపేటలకు రూ.18.7కోట్ల చొప్పున, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15కోట్లకుపైగా విడుదలయ్యాయి. ప్రధానంగా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో సుందరీకరణలో భాగంగా.. సెంట్రల్‌ లైటింగ్‌, హౌసింగ్‌ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్‌ పార్కు ఆధునీకరణ, ఇందిరాపార్క్‌ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్‌ పార్కు సుందరీకరణకు రూ.కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్‌లో ఉన్న సెంట్రల్‌ లైటింగ్‌ కోసం రూ.1.5కోట్లు, మరో రూ.15కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పనులను ప్రారంభించాల్సి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఈ నిధుల్లో సింహభాగం సుందరీకరణకే వెచ్చించాలనుకుంటున్నారు. పాలకవర్గాల చొరవపైనే పనుల ప్రగతి ఆధారపడి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement