హమాలీల కోసం నూతన చట్టం
● సిద్దిపేటను ప్రగతి బాటపట్టిస్తా
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● త్వరలో రెండు లక్షల కొత్త పింఛన్లు
● కార్మిక శాఖ మంత్రి వివేక్
సిద్దిపేటజోన్: సిద్దిపేటను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత నాపై ఉందని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేట ప్రాంతంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎనిమిదవ వార్డులో పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలనగా అభివర్ణించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండు లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణానికి త్వరలో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వార్డుల్లో కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి హరికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు యాదగిరి, మహేందర్‌లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నైపుణ్యం కల్గిన కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్రంలోని హమాలీల కోసం నూతన చట్టాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన 14 కార్మిక సంఘాల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ కల్పనకు రూ.90 కోట్లు మంజూరు చేసామన్నారు. టామ్‌కామ్ కంపెనీ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు, కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇచ్చేందుకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. ప్రతి జిల్లాకు భవన నిర్మాణ కార్మికుల కోసం కార్మికసంఘ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అర్హులెన ప్రతి ఒక్క కార్మికునికి లేబర్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సిద్దిపేటలో కార్మిక సంఘం భవనానికి స్థల కేటాయింపుతోపాటు, నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


