మిరుదొడ్డి(దుబ్బాక): విత్తనం వేసింది మొదలు చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతులకు నానా తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ఉన్న ఉత్సాహం.. వాటి నిర్వహణపై లేకపోవడంతో ధాన్యపు రాశులు ఎక్కడిక్కడా నిలిచిపోయాయి. మిరుదొడ్డి మండల కేంద్రంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కేంద్రాలను నెల క్రితం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. మొదట్లో నామమాత్రంగా కొనుగోళ్లను ప్రారంభించిన అధికారులు రాను రాను కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోవండంతో రోజుల తరబడి ఎండలో నానా అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంగా దౌల్తాబాద్, అక్బర్‌పేట–భూంపల్లి, రాయపోల్, దుబ్బాక మొదలైన మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి రైతులు మొక్కజొన్న, పొద్దు తిరుగుడు ధాన్యాన్ని విక్రయించడానికి తీసుకువస్తున్నారు. ధాన్యాన్ని తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తున్నా అధికారులు కాంటా పెట్టకపోవడంతో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద మండుటెండలో పడరాని అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ధాన్యం కేంద్రం వద్ద ఎలాంటి మౌలిక వసతులు లేక, మండుతున్న ఎండలకు నిలువు నీడ లేక అరిగోస పడుతున్నామని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్లోనే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రాశులు
మండుతున్న ఎండల్లోనే రైతుల పడిగాపులు
దృష్టిసారించని అధికారులు


