● మాజీమంత్రి హరీశ్‌రావు
● కేసీఆర్ ట్రోఫీలో విజేతలకు బహుమతుల ప్రదానం
సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట మట్టి బిడ్డ భారత క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా స్వప్నం.. అప్పుడే సిద్దిపేట స్టేడియానికి సార్థకత లభిస్తుంది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ అంటే ఒక ఆట కాదని, ఒక కమ్యూనిటీ అని, అందరూ కలిసి కట్టుగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందన్నారు. నేటి యువత కూడా కలిసి మెలసి ఉండాలని సూచించారు. స్నేహం అంటే జీవితాంతం తోడునీడగా ఉండాలన్నారు. క్రికెట్ ఆటలో ఆల్‌రౌండర్ మాదిరి నిజజీవితంలో కూడా చదువు, ఉద్యోగం, సమాజానికి సేవ, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. క్రికెట్‌ను కాలక్షేపం కోసం కాకుండా సీరియస్‌గా ఆడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
భవిష్యత్తులో మహిళా టోర్నీ..
మగవాళ్లతో సమానంగా మహిళలు కూడా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నారని, భవిష్యత్తులో సిద్దిపేట ప్రాంత అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ఉమెన్స్ క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. అనంతరం ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన గణేశ్‌నగర్ 11 జట్టుకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన కింగ్స్ ఖాదర్ పూర జట్టుకు రూ.50వేల ప్రైజ్ మని అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


