రక్తం నిండుకుంటోంది | - | Sakshi
Sakshi News home page

రక్తం నిండుకుంటోంది

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

‘గత నెల 31న సిద్దిపేట జీజీహెచ్‌లో రోగికి అత్యవసర చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. దీంతో బ్లడ్‌ కోసం ఇబ్బంది పడుతుంటే సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ స్పందించి రక్తదానం చేశారు. దీంతో ఆ వ్యక్తికి అత్యవసర చికిత్స పూర్తి చేశారు’.

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు, 20 నుంచి 30 మంది మహిళలు పురుడు పోసుకుంటున్నారు. ఇందులో చాలా మందికి రక్తం అవసరం అవుతోంది. తలసేమియా బాధితులకు పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం జిల్లాలో బ్లడ్‌ బ్యాంక్‌లో నిల్వలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. జీజీహెచ్‌ (ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి)లో బ్లడ్‌ బ్యాంక్‌ ఉంది. వేసవిలో ఏర్పడే కొరతను అధిగమించేందుకు దాతల సహకారం అవసరం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉచితంగా రక్తం కావాలంటే ఇతరుల నుంచి సేకరించి ఇవ్వాల్సి వస్తోంది. వేసవిలో ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితులున్నాయి.

నెగెటివ్‌ స్టాక్‌ తక్కువ

జీజీహెచ్‌లో నెగెటివ్‌ బ్లడ్‌ స్టాక్‌ చాలా తక్కువగా ఉంది. బ్లడ్‌ బ్యాంక్‌ మొత్తంగా అన్ని రకాల గ్రూప్‌లు కలిపి 112 యూనిట్‌ల రక్తం మాత్రమే నిల్వ ఉంది. అందులో ఏబీ పాజిటివ్‌ 08, ఏబీ నెగిటివ్‌ 01, ఓ పాజిటివ్‌ 39, బీ పాజిటివ్‌ 35, ఏ పాజిటివ్‌ 18, ఏ నెగిటివ్‌ 02, ఓ నెగిటివ్‌ 06, బీ నెగిటివ్‌ 03 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రక్తం కొరత ఉండటంతో బ్లడ్‌ అవసరం ఉన్న వారి తరఫున ఒకరు డొనేట్‌ చేస్తే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో డొనర్‌ కోసం రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా కొరత ఉండే నెగిటివ్‌ గ్రూప్‌లకు సంబంధించిన ఫోన్‌ నంబర్లకు బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది ఫోన్లు చేసి పిలిపిస్తున్నారు.

ఎవరు ఇవ్వొచ్చు..

18– 55 వయసు ఉండి.. 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వారే రక్తదానం చేయాలి. మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. 350 మిల్లీ లీటర్ల మేర రక్తం సేకరిస్తారు. రక్తదానం చేయడంతో శరీరంలో ఐరన్‌, మినరల్‌ లెవెల్స్‌ సమస్థాయిలో ఉండి, శరీరానికి మేలు చేస్తాయి.

దాతలు స్పందించాలి

రక్త నిల్వలు సమకూరేందుకు యువత, రాజకీయ పార్టీ నేతలు, సినీ హీరో అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. రక్తం కొరత నుంచి గట్టెక్కించ్చేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి. రాజకీయ నేతలు, సినీ హీరో పుట్టిన రోజుల, పెళ్లి రోజుల సందర్భంగా దాతలు ముందుకు వచ్చి యువత, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు. అలాగే ఆస్పతి సిబ్బంది ప్రభుత్వ ప్రైవేట్‌ కళాశాలలను సంప్రదించి విద్యార్థులచే క్యాంప్‌లను ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పించాలి.

బ్లడ్‌ బ్యాంక్‌లో తగ్గుతున్న నిల్వలు

నెగెటివ్‌ గ్రూపుల స్టాక్‌ చాలా తక్కువ

అన్నీ కలిపి 112 యూనిట్లే నిల్వ

వేసవిలో మరింత తగ్గే అవకాశం

ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

వేసవిలో సాధారణంగా రక్తం కొరత ఉంటుంది. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రస్తుతం జీజీహెచ్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో అన్ని గ్రూప్‌ల రక్తపు నిల్వలున్నాయి. బ్లడ్‌ అవసరం ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులు రక్తం డొనెట్‌ చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి క్యాంప్‌లు ఏర్పాటు చేస్తే వేసవిలో రక్తం కొరత లేకుండా ఉంటుంది.

– డాక్టర్‌ జ్యోతి, ఆర్‌ఎంఓ, జీజీహెచ్‌

Advertisement
 
Advertisement
Advertisement