సాక్షి, సిద్దిపేట: పసిడి పండుగ రానే వచ్చింది. ఏటా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. దీంతో జిల్లాలోని ప్రముఖ బంగారం షాప్‌లన్నీ కొత్త మోడళ్ల ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో తక్కువ బరువు ఉండే నగలను రూపొందించారు. వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో పనిలో పనిగా ఈ రోజు నగలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్ల బంగారు నగల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు బంగారం షాపులు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి
ధర ఎక్కువ ఉన్నా..
బంగారం ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకుని గ్రాము నుంచి 5 గ్రాముల కాయిన్‌లను అందుబాటులో ఉంచారు. ఆదివారం షాపులన్నీ రద్దీగా ఉంటాయని భావించి కొంత మంది ఇప్పటికే నగలను ఎంపిక చేసుకుని అడ్వాన్స్‌లు సైతం ఇచ్చారు. అక్షయ తృతీయ రోజు అభరణాలు తీసుకెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కాగా పలు బంగారం షాపులు ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని షాపుల నిర్వాహకులు తరుగులో తగ్గింపు, గోల్డ్, వెండి కాయిన్స్ అందజేయనున్నారు. వివిధ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులకు క్యాష్ బ్యాక్‌ను రూ. 1,000 నుంచి రూ.5 వేలు ప్రకటించారు.
నేడే అక్షయ తృతీయ
ప్రత్యేక ఆఫర్లతో హడావుడి
జిల్లాలో రూ.50 కోట్ల
వ్యాపారం జరిగే అవకాశం
అందుబాటులోకి మోడల్స్
అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకొని అనేక మోడల్స్ ఆభరణాలను అందుబాటులో ఉంచాం. ఎంతో కొంత బంగారమైన కొనుగోలు చేయాలని ప్రజల భావిస్తారు. బంగారు ఆభరణాలపై ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
– రాజేశ్, సేల్స్ మేనేజర్,
మలబార్ జ్యువెల్లర్స్, సిద్దిపేట


