సిద్దిపేట ఎడ్యుకేషన్: తనను కవిగా నిలబెట్టిన కళాశాల సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలేనని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని ిసిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించిన సందర్భంగా శనివారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ..సిద్దిపేట కళాశాల విద్యార్థిగా తాను కవిత్వంలోకి అడుగు పెట్టానని కళాశాల వాతావరణం తనను కవిగా తీర్చిదిద్దిందన్నారు. బాల్యంలోని బంగారం జ్ఞాపకాలను యువకుడిగా డిగ్రీ కాలేజీ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని వాటి ప్రేరణలను విద్యార్థులకు వివరించారు. ‘కట్టువోతల బందారం– బాల్య జ్ఞాపకాలు’‘సిద్దిపేట కాలేజీలో తన విద్యార్థి జీవితం’ఇవి రెండు తనను కవిగా పరిశోధకుడిగా నిలబెట్టాయన్నారు. సిద్దిపేట గడ్డ బందారం గడ్డ ఆనాటి రైతాంగ ఉద్యమాలు తనకు ఉద్యమస్ఫూర్తిని ఉగ్గుపాలతోనే నేర్పించాయని గుర్తు చేసుకున్నారు. కళాశాల తనను ఆత్మీయంగా సత్కరించటం గొప్ప గౌరవమని కళాశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల పూర్వ విద్యార్థి పూర్వాధ్యాపకులు సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత అభినందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.పాపయ్య, సిధారెడ్డి బాల్య స్నేహితులు, అధ్యాపక మిత్రులు బాల నరసయ్య, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, రవికుమార్, శ్రీహరి యాదవ్, బాలమణి, తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ మట్ట సంపత్ కుమార్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.అయోధ్యరెడ్డి, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ గోపాల సుదర్శనం, తెలుగు విభాగం అధ్యాపకులు పిట్ల దాసు, నారోజు వెంకటరమణ, విద్యార్థులు, పాల్గొన్నారు.
డాక్టర్ నందిని సిధారెడ్డి


