ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రోడ్డు భద్రతలపై నిర్లక్ష్యం వీడాలని, నిబంధనలు పాటిస్తే క్షేమంగా గమ్యం చేరవచ్చని రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం, సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి లక్రా మాట్లాడుతూ రహదారి భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరిదన్నారు. రోజూ జరుగుతున్న ప్రమాదాలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలేనన్నారు. ముఖ్యంగా వాహనదారులు నిద్రలేకుండా సుదూర ప్రయాణాలు చేయడం, మద్యం సేవించడం, అతివేగం, కంటిచూపు సక్రమంగా లేకపోవడమే కారణమన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్ , హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలో కంటి చూపు సమస్యలు వస్తాయన్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు తక్షణం సీపీఆర్ చేయడం ద్వారా వారి జీవితాన్ని రక్షించే అవకాశం ఉంటుందన్నారు. అంతకు ముందు సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వాహనదారుడు క్షేమంగా ఇంటికి చేరడమే అన్నారు. అందువలన వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రహదారులపై ప్రయాణాలు చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. రహదారులపై ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే డయల్ 100, 108లకు సమాచారం అందించి, ప్రాణాలను కాపాడాలన్నారు. అనంతరం రహదారి భద్రతపై వాహనదారులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో పోలీస్‌శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం
రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా


