మావోయిస్టు భాగ్య కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే
మిరుదొడ్డి(దుబ్బాక): ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా మాచ్‌పల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 13న పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన భాగ్య ఎలియాస్ రూపీ మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి భాగ్య కుటుంబాన్ని పరామర్శించారు. భాగ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత వర్గాల అభ్యున్నతి కోసం 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి పోరాడి అసువులు బాసిన భాగ్య మృతి చెందడం బాధాకరమన్నారు. పరామర్శించిన వారిలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.


