యాజమాన్య హక్కులు లేక..
సాదాబైనామాలకు
● జిల్లా వ్యాప్తంగా 44వేల దరఖాస్తులు పెండింగ్
● ఆరేళ్లుగా ఎదురుచూపులు
● నోటీసులు సిద్ధం చేస్తున్న తహసీల్దార్లు
రెవెన్యూ పెండింగ్
డివిజన్ దరఖాస్తులు
సిద్దిపేట 26,591
గజ్వేల్ 6,200
హుస్నాబాద్ 12,153
సాదా బైనామాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. జిల్లా వ్యాప్తంగా 44వేల మంది దరఖాస్తు దారులు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. భూ క్రయవిక్రయదారులు ఇద్దరూ అఫిడవిట్ సమర్పించాలనే నిబంధనను సవరించారు. ఆర్డీఓ విచారణాధికారిగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించనున్నారు. – సాక్షి, సిద్దిపేట
కాగితాలపై బాండ్ పేపర్ల ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూములను చట్టబద్ధత కల్పించేందుకు గతంలో అవకాశం కల్పించింది. దీంతో సాదా బైమానాల కింద 2020లో దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి నుంచి పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో అవి రికార్డుల్లోకి ఎక్కలేదు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రం హక్కులు రాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 44,944 మంది రైతుల సాదా బైనామాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొనుగోలు, విక్రయదారులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాలని గతంలో ప్రకటించగా పలు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో తాజాగా ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రమే అఫిడవిట్‌ను సమర్పించాలని సవరణ చేసింది.
ఎదురుచూపులు
కొన్నేళ్లుగా భూమిని సాగు చేస్తున్నా పట్టా పాస్ బుక్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ధరణిలో భాగంగా కొందరికీ పట్టా పాస్ బుక్‌లు చేశారు. తర్వాత స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలగలేదు. దీంతో ఆరేళ్లుగా దరఖాస్తు దారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం
గత ప్రభుత్వంలో జరిగిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ తహసీల్దార్లు పూర్తి చేశారు. ప్రస్తుతం భూభారతి చట్టం ప్రకారం ఆర్టీఓలకు అధికారాలు కల్పించారు. తహసీల్దారు విచారణ నివేదిక పంపిస్తే వాటిని పరిశీలించి ఆర్డీఓ భూ భారతి పోర్టల్‌లో భూ భారతి సమాచారం నమోదు చేసి హక్కులు కల్పించనున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విచారణలో తేలే అంశాలే కీలకంగా మారనున్నాయి. క్రమబద్ధీకరించాల్సిన భూముల సరిహద్దు రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేయనున్నారు. సాదాబైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండటంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరాలేవీ రాకుంటే క్రమబద్ధీకరణ సులువుగా పూర్తికానున్నాయి.
ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు యాజమాన్య హక్కులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం అందించే రైతు భరోసా, బీమా వీరికి అందడం లేదు. ధాన్యం విక్రయించే సమయంలో పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడంతో ఇతర రైతు పేరు మీద నమోదు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం భూ భారతిలో సాదాబైనామాలకు సంబంధించి పలు సవరణలు చేయడంతో భూ యాజమాన్య హక్కులు వస్తాయని దరఖాస్తు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


