జిల్లాలో బయో రిసోర్స్ యూనిట్లు!
ఇద్దరు చొప్పున ‘కృషి సఖి’లు
గజ్వేల్: ఎన్‌ఎంఎన్‌ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) పథకం అమలులో మరో ముందడుగు పడింది. ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించేందుకు బయోరిసోర్స్ యూనిట్లను ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ యూనిట్ల ద్వారా రైతులకు పూర్తిగా సేంద్రియ ఎరువులను అందించి ప్రోత్సహించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 15క్లస్టర్ల పరిధిలోని 1,825మంది రైతుల వ్యవసాయక్షేత్రాల్లో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. సదరు రైతులకు ఇందుకోసం భూసార పరీక్షల కార్డులను అందించి.. వారి నేల స్వభావానికనుగుణంగా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో సుమారు 5.50లక్షలు, యాసంగిలో 3.50లక్షల ఎకరాల వరకు సాగులో వస్తుంటాయి. ఈ రెండు సీజన్లలోనూ రైతులు రసాయనిక ఎరువులపైనే ఆధాపడుతున్నారు. మోతాదుకు మించి ఎరువులను వాడటం వల్ల నేల సారం తగ్గి పంటల సాగులో దిగుబడులు పడిపోయి రైతులు నష్టాల బారిన పడటం సహజపరిణామంగా మారుతున్నది. మరోవైపు పంటల ఉత్పత్తుల్లో పోషకాలు లోపించి, కలుషితమవుతున్నాయి. ఈ దుస్థితిని నివారించేందుకు గతంలో ఉన్న సేంద్రియ పథకాల కంటే కొంత మెరుగ్గా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకం తీసుకొచ్చింది.
పథకం అమలు తీరు ఇలా..
గతేడాది యాసంగి సీజన్‌లో ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకం కింద జిల్లాను 15సెక్టార్లగా విభజించారు. ఒక్కో సెక్టార్‌కు 125మంది రైతులను మొత్తంగా 1,875మందిని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోఎంపిక చేసిన రైతుల వ్యవసాయక్షేత్రాల్లో పూర్తిస్థాయి మట్టి నమునాలు సేకరించారు. మట్టి నమునాలను పరీక్షించి నేలల్లో భాస్వరం, జింక్, మాంనీస్, పొటాషియం, కర్భనము, బోరాన్ తదితర పోషకాల లభ్యతను, ఇతర లోపాలను గుర్తించారు. ఈమేరకు రైతులకు భూసార పరీక్షల కార్డులను అందిస్తున్నారు. కార్డుల్లో వచ్చిన ఫలితాల మేరకు ప్రకృతి సేద్యం చేపట్టడానికి రైతులను ప్రోత్సహించనున్నారు.
యూనిట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం
ప్రకృతి సేద్యానికి సన్నద్ధమవుతున్న రైతులకు సేంద్రియ ఎరువులను అందించేందుకు జిల్లాలో పది వరకు బయోరిసోర్స్ యూనిట్ల ఏర్పాటుచేయడానికి రంగం సిద్ధమైంది. ఈ యూనిట్ల ద్వారా ప్రస్తుతం ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకం అమల్లో ఉన్న 15 క్లస్టర్లకు పూర్తిస్థాయి సేంద్రియ ఎరువులు అందిస్తారు. మొలక దశ నుంచి పంట చేతికొచ్చేవరకు పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడేలా చూస్తారు.
ఒక్కో క్లస్టర్‌కు ఇద్దరేసి ‘కృషి సఖి’లను నియమించారు. సేంద్రియ సాగుపై వీరికి శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరు ఎంపిక చేసిన రైతుల వ్యవసాయక్షేత్రాల్లో నిరంతరం సలహాలు, సూచనలు అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం వీరికి పారితోషికం అందించనుంది.
ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకంలో మరో ముందడుగు
ఇప్పటికే రైతులకు భూసార పరీక్షల కార్డులు
సేంద్రియ ఎరువులను అందించేందుకు కార్యాచరణ
15 క్లస్టర్లలోని 1,875 రైతుల వ్యవసాయక్షేత్రాల్లో కార్యక్రమాలు


