గజ్వేల్: గతేడాది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మెరిట్ సాధించిన దళిత విద్యార్థులకు అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం నగదు పారితోషికాలను అందజేశారు. మండలంలోని ఆహ్మదీపూర్ ఉన్నతపాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి గోవర్ధనగిరి, కొడకండ్ల ఉన్నత పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థిని అక్షిత, ఇంటర్‌కు సంబంధించి ములుగు మండలం అడవిమజీద్‌కు గ్రామానికి చెందిన మనోహర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని క్యాసారం గ్రామానికి చెందిన భావన పారితోషికాలను అందుకున్నవారిలో ఉన్నారు. అదేవిధంగా దళిత సర్పంచ్‌లు, కౌన్సిలర్లను సైతం ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి ఎం. కిష్టయ్య, నాయకులు మన్నె కృష్ణ, ఎం.నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు తమలోని ప్రతిభను చాటితేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో మంగళవారం ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమలోని నైపుణ్యాన్ని చాటినపుడే అవకాశాలు లభిస్తాయన్నారు. జాబ్‌మేళాకు ఎంపికై న విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాబ్‌మేళాకు గజ్వేల్‌తో పాటు ములుగు, జగదేవ్‌పూర్, దౌల్తాబాద్ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 81 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 47 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కృష్ణంరాజు, శర్మతో పాటు ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బెజ్జంకి(సిద్దిపేట): 108 వాహనాన్ని ప్రోగ్రాం మేనేజర్ సంపత్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్సులోని మందులు, వైద్య పరికరాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఈఎంటీ రాజు, పైలెట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తబకం, భాగ్యశ్రీ శతకం పుస్తకావిష్కరణలు ఈ నెల 19న హైదరాబాదులో జరుగుతాయని కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఈ మేరకు మంగళవారం పుస్తకావిష్కరణలకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ పుస్తకావిష్కరణల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, అవుసుల భాను ప్రకాష్, కంది శంకరయ్య, బండకారి అంజయ్య గౌడ్, వరుకోలు లక్ష్మయ్య, మంచినీళ్ల సరస్వతీ రామశర్మ, బడేసాబ్ హాజరవుతారన్నారు.
సిద్దిపేటకమాన్: రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రెడ్డి జేఏసీ నేతలు కోరారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం వారు మాట్లాడుతూ రెడ్డి జేఏసీ, ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు.


