● అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు
● కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీపెరుమాళ్
సిద్దిపేటకమాన్: భారత రాజ్యాంగంలో పౌరులకు ఉన్నతమైన హక్కులను కల్పించి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లా కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందరికీ ఆదర్శనీయుడని, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తన సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. గొప్ప నాయకుడిగా ఎదగడం ఒక్కరోజులో సాధ్యం కాదని, ఎన్నో కష్టాలను అధిగమిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహోన్నత నాయకుడన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావుల్లో గుర్తింపు పొందిన అంబేడ్కర్ మన దేశానికి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు.
సమాజసేవలో ముందుండాలి
సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ..అంబేడ్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ జీవితంలో ఉన్న మంచి విలువలను స్వీకరించి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుండాలని సూచించారు. ఏసీఎల్బీ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితంలో నుంచి ఓర్పు, పట్టుదల, బాధ్యత వంటి గుణాలను అలవర్చుకోవాలన్నారు. అంతకుముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్‌లో భాగంగా రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఎస్సీ వెల్ఫేర్ విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం, అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, సుమన్‌కుమార్, సీఐలు, ఆర్టీఓ శంకర్‌నారాయణ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


