పరిశీలన సరే..
● కంపుకొడుతున్న రామసముద్రం చెరువు
● చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
దుబ్బాకటౌన్: చెరువుల్లో పెరుగుతున్న గుర్రపు డెక్కతో నీటిలోని చేపలు, ఇతర జల చరాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. దుబ్బాక పట్టణంలోని రామసముద్రం చెరువు ఆరేళ్లుగా గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. దాదాపు సగం చెరువును గుర్రపు డెక్క ఆక్రమించింది. డెక్క చెరువు మొత్తాన్ని ఆక్రమిస్తుండడంతో నీటి సాంద్రత దెబ్బతింటోంది. నీరు కలుషితం అవుతుండడంతో చేపల్లో ఎదుగుదల లోపిస్తోంది. చెరువులోని చేపలు, ఇతర జలచరాల మనుగడకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
పట్టణ మురుగంతా చెరువులోకే..
దుబ్బాక పట్టణంలోని మురికి కాలువల నుంచి వస్తున్న మురుగు అంతా చెరువులోకి చేరుతుండటంతో గుర్రపు డెక్క బాగా వ్యాపిస్తోందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నీరు కలుషితమవుతోంది. ఫలితంగా దుర్వాసన వ్యాపిస్తోంది. ఉదయం, సాయంత్రం వ్యాయామానికి చెరువు కట్టపైకి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గుర్రపు డెక్కను తొలగించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు మత్స్యకారులు, స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం రామసముద్రం చెరువులో చేపల పెంపకం బాగా తగ్గిపోయింది.
ఇటీవల గుర్రపు డెక్కను తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్, వార్డు కౌన్సిలర్ రాజు పరిశీలించారు. చెరువులో జలచరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుర్రపు డెక్కను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినా తగినంత బడ్డెట్ లేకపోవడంతో ఆచరణ ముందుకు సాగలేదు.


