● కలెక్టర్ హైమావతి
● ‘అరైవ్–అలైవ్’ పోస్టర్ ఆవిష్కరణ
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ హైమావతి సూచించారు. ‘ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కొండపాకలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రయాణం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రమాదకర ప్రదేశాలను గుర్తించడం, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడం, చెట్ల పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అంతకు ముందు అరైవ్–అలైవ్ కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, ప్రజలచే ప్రతిజ్ఞ చేయించి వాల్ పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి, ఆర్టీఓ శంకర్ నారాయణ, ఎంపీఓ మల్లికార్జున్, సర్పంచ్ నవీన, నాయకులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరి
మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కొండపాకలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించారా? రుచికరంగా ఉందా? అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సరుకుల స్టోర్ రూంలో జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్షం చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. కాలం చెల్లిన సరుకులు, ఆహారపదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదన్నారు.


