సిద్దిపేటరూరల్: హామీ మేరకు దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ అమలు చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అడివయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు భాస్కర్‌లు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 22 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. పెన్షన్ రూ.6వేలకు పెంచి అమలు చేయాల్సిందేనని అన్నారు. ఎంపికై న 222 మంది లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు మంజూరు చేస్తున్న స్వయం ఉపాధి రుణాల్లో 5 శాతం రుణాలు దివ్యాంగులకు ఇవ్వాలన్నారు. జిల్లాలో వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీ కోసం నిర్వహిస్తున్న సదరం క్యాంపు నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్, డీడబ్ల్యూఓకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఓఏఓ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎండీ సాజీద్, కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య


