కాంకేర్ జిల్లాకు తరలిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
మిరుదొడ్డి(దుబ్బాక): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా మాచ్‌పల్లి అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు రంగనబోయిన భాగ్య ఎలియాస్ రూపీ మృత దేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తరలి వెళ్లారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన మావోయిస్టు భాగ్య పెద్ద చెల్లెలు కవిత, తమ్ముడు కుమార్, సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్తులు కాంకేర్ జిల్లా ఎస్‌పీ సమక్షంలో భాగ్య మృతదేహాన్ని గుర్తించనున్నారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాగ్య.. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆమె స్వగ్రామమైన ధర్మారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


