స్కాంల దృష్టి మరల్చడానికే..
అలీబాబా 40 దొంగలు.. అనేక కుంభకోణాలు కేసీఆర్ ఇంటి గోడలకు నోటీసులు అంటించడం దారుణం బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనలేకనే సిట్ పేరుతో డ్రామాలను ఆడుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. శనివారం సిద్ది పేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హామీలపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారేమోనని భయంతో సిట్‌ను తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. అలీబాబా 40 దొంగలు, దండుపాళ్యం, లిక్కర్ కుంభకోణాలు, బొగ్గు స్కాం, హైదరాబాద్‌లో 9,300 ఎకరాల భూమి కబ్జా, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చిల్లర వేషాలు వేయడం తగదన్నారు. నలుగురు ఐపీఎస్‌లతో సిట్‌ను ఏర్పాటు చేసి ఇష్టారీతిన ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. రెండేళ్లుగా 350 మందిని, రెండు వారాలుగా బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావులను 160 సీపీఆర్ ప్రకారం ఈ కేసులో సాక్షులుగా 7 నుంచి 9 గంటల పాటుగా సిట్ విచారించిందని పేర్కొన్నారు, అందులో ఏమీ తేలలేదన్నారు. రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. 1885 ఇండియన్ టెలిగ్రాం యాక్ట్ ప్రకారం దేశంలో ఎవరి ఫోన్‌నైనా కేవలం నిఘా అధికారులు మాత్రమే దేశ భద్రత, తదితర అంశాల కోసమే ట్యాపింగ్ చేస్తాయని, ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. కేసీఆర్ ఉండేది ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనని, నందినగర్‌లోని నివాసం గోడకు నోటీసులు అంటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అవసరం ఉంటే ఎర్రవల్లిలోనే విచారించాలని, అందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారన్నారు.
సిట్ పేరిట సర్కార్ డ్రామాలు


