టికెట్ల సమన్వయం సరే.. మరి ఎన్నికల్లో?
కలుగజేసుకున్న అధినాయకత్వం
జహీరాబాద్ టికెట్లపై శ్రేణులకు మంత్రి అజారుద్దీన్ వివరణ
‘ఖేడ్’టికెట్లపై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య అధినాయకత్వం సమన్వయం!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ టికెట్ల పంచాయతీ రాష్ట్ర రాజధానిలోని గాంధీభవన్‌కు చేరింది. పలు మున్సిపాలిటీల్లో రెండు, మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు పట్టుబట్టారు. దీంతో ఈ టికెట్లలొల్లి ముదిరిపాకాన పడింది. ఈ టికెట్ల పంచాయితీని పరిష్కరించేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు, మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏకాభిప్రాయం కుదరని టికెట్ల విషయంలో ఆయా వర్గాల నేతలను సమన్వయం చేసి టికెట్లను ఖరారు చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కుదరని సమన్వయం
నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని టికెట్ల కోసం ఎంపీ షెట్కార్‌తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పట్టుబట్టారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేయాలని భావించినప్పటికీ..మూడు,నాలుగు వార్డుల టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ టికెట్లలొల్లి గాంధీభవన్‌లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కౌన్సిలర్‌గా నామినేషన్ కూడా వేశారు. ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు షెట్కార్ అనుచరులకు దక్కినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మెదక్ కాంగ్రెస్‌లోనూ టికెట్ల కుదుపు
రామాయంపేట మున్సిపాలిటీ టికెట్ల లొల్లి ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. ఈ టికెట్లలొల్లి కారణంగా టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పలువురు కాంగ్రెస్ నాయకులకు పొసగడం లేదు. ఈ క్రమంలో రామాయంపేట బల్దియా చైర్మన్ పదవిని తన కుటుంబసభ్యులకు ఆశించగా, కౌన్సిలర్ టికెట్ ఇచ్చేందుకు మైనంపల్లి నిరాకరించడంతో ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. ఇలా పలుచోట్ల కాంగ్రెస్ టికెట్లు ఆ పార్టీలో వర్గవిభేదాలను, ఆధిపత్యపోరు, అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేసినట్లైంది.
అనుకూలంగా మార్చుకుంటున్న బీఆర్‌ఎస్
అధికార పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అనుకూలంగా మార్చుకుంటోంది. ఆ పార్టీలోని కీలక నాయకులకు గులాబీ కండువా కప్పి తగిన ప్రాధాన్యతనిస్తోంది. తద్వారా అధికార పార్టీని నైతికంగా దెబ్బతీయడమే కాకుండా, ఈ ఎన్నిక ఈ మున్సిపల్ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజారిటీ చైర్‌పర్సన్ స్థానాలపై గురిపెట్టిన బీఆర్‌ఎస్..కాంగ్రెస్‌లోని కుమ్ములాటలను అనుకూలంగా మార్చుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకెళుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఆధిపత్య పోరుతో
తేలని అభ్యర్థిత్వాలు
టికెట్ల కేటాయింపు వరకు టీపీసీసీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలను సమన్వయం చేయగలిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు ఎంతవరకు కలసి పనిచేస్తాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు వర్గవిభేదాలు వీడి సమన్వయంతో పనిచేస్తే మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయతీరాలకు చేరుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు ఎంతమేరకు సమన్వయంతో పనిచేస్తారనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే.


