గెలిచే అభ్యర్థులకే బీఫాంలు
సంగారెడ్డి: గెలిచే అభ్యర్థులకే బీఫారమ్‌లు అందజేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వారికి బీ ఫారమ్‌ల పంపిణీపై మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, సంగారెడ్డి టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, సీఎం సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్‌రావు హాజరయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల చేతుల మీదుగా బీఫారాలు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు.
సర్దిచెప్పిన అజారుద్దీన్
జహీరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ టికెట్ల ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటకు దారి తీసింది. 19 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించడం గందరగోళానికి కారణమైంది. ఈ ప్రకటనపై సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్‌రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఏకంగా రాష్ట్రమంత్రి, మున్సిపల్ ఎన్నికల కోసం నియమితులైన ఇన్‌చార్జి అజారుద్దీన్ కలుగజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల జాబితా ప్రకటించలేదని అజారుద్దీన్ సర్దిచెప్పాల్సివచ్చింది. గాంధీభవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఈ టికెట్ల పంచాయితీని కొలిక్కి తెచ్చారు. ఇక్కడ ఎంపీ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్, గిరిధర్‌రెడ్డి అనుచరులు ఈ టికెట్ల రేసులో ఉన్న విషయం తెలిసిందే.


