పట్టణం, గ్రామీణం కలయిక.. దుబ్బాక
● ఏడు గ్రామాలతో దుబ్బాక మున్సిపల్‌గా ఆవిర్భావం ● ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నం ● రెండోసారి మున్సిపల్ పోరుకు సిద్ధం
దుబ్బాక: అటు పట్టణం కాదు... ఇటు పూర్తిగా గ్రామం కాకుండా భిన్నమైన పరిస్థితి దుబ్బాక మున్సిపాలిటీది. భౌగోళికంగా దుబ్బాక మున్సిపాలిటీ సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉండడంతో భిన్నమైన సంస్కృతి పెనవేసుకుంది. వ్యవసాయం, చేనేత, బీడీ పరిశ్రమనే నమ్ముకొని ప్రజలు జీవనం గడుపుతుండడంతో ఆ వాతావరణమే ఇక్కడ కనిపిస్తుంది.
ఏడు గ్రామాలతో దుబ్బాక మున్సిపల్‌గా..
మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న దుబ్బాకతో పాటు పట్టణానికి మూడు కిలోమీటర్ల పరిధిలోని చెల్లాపూర్, లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, మల్లాయపల్లి, దుంపలపల్లి గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 2012లోనే ఏడు విలీన గ్రామాలతో కలిపి మున్సిపల్‌గా ఏర్పాటు చేయడంతో కొందరు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు.దీంతో సుమారుగా 12 ఏళ్లుగా మున్సిపల్‌పై నిర్ణ యం పెండింగ్‌లోనే ఉండిపోయింది. దీంతో రెండు పర్యాయాలు అంటే పదేళ్లకు పైగా ఈ ఏడు గ్రామా ల్లో అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికలకు ప్రజలు దూరంగా ఉండాల్సి వచ్చింది.
రెండోసారి మున్సిపల్ పోరుకు..
2020లో దుబ్బాక మున్సిపాలిటీగా ఆవిర్భవించాక మొదటిసారి ఎన్నికలు జరగగా తాజాగా ఇప్పుడు రెండవ సారి ఎన్నికలకు సిద్ధమైంది. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డుల పరిధిలో సుమారుగా 40 వేలకు పైగా జనాభా ఉంది. మొదటిసారి 2020లో జరిగిన ఎన్నికల్లో 19,360 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు రెండు వేలకు పైగా ఓటర్లు పెరగడం విశేషం.


