మెరుగైన వైద్యసేవలందించాలి
● వెయ్యి పడకల ఆస్పత్రిఅందుబాటులోకి తేవాలి ● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటకమాన్: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేటలో గత ప్రభుత్వంలో రూ.10కోట్లతో నిర్మించిన ఆయుష్, యునాని, హోమియా ఆస్పత్రి సేవలను వచ్చే పదిహేను రోజుల్లో అందుబాటులోకి తేవాలని కోరారు. సిద్దిపేటలో నిర్మించిన ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను హరీశ్‌రావు సోమవారం సందర్శించారు. అవసరమైన పనులపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న వెయ్యి పడకల ఆస్పత్రి పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. వచ్చే జూన్‌లోగా ప్రజలకు వెయ్యి పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలందించాలన్నారు. ఆయుష్, యునాని, హోమియోకి సంబంధించిన వైద్యులు, థెరపిస్ట్‌లను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఆస్పత్రుల్లో మందుల సరఫరాపై అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.


