ఎత్తుకు.. పైఎత్తు
ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద
● గజ్వేల్ మున్సిపల్ పోరు రసవత్తరం
● చైర్మన్ పీఠమే లక్ష్యంగా నేతల పావులు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు ఎత్తుకు.. పైఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
– గజ్వేల్
నామినేషన్ల పరిశీలన తర్వాత ఇక్కడ 125మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 33, బీఆర్‌ఎస్ 37, బీజేపీ 28, సీపీఎం, బీఎస్పీ నుంచి ఒకరు చొప్పున, ఇండిపెండెంట్లు 13మంది ఉండగా.. గుర్తింపు పొందిన పార్టీల నుంచి మరో 12మంది బరిలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పుడే.. అసలు కథ మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3 తుది గడువు ఉండగా.. అన్నీ పార్టీల్లోనూ నేతలు రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఒక పార్టీ కదలికలపై మరో పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఓ ప్రధాన పార్టీలో రెబెల్స్ బెడద ఎక్కువగా కనిపిస్తుండగా.. వారిని ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నేత మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమచారం. వారిని అలాగే పోటీలో ఉండాలని, అలా ఉంటే సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది గమనించిన సదరు పార్టీ ముఖ్యనేతలు సైతం ఎత్తుకుపై ఎత్తు వేస్తూ..ముందుకుసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తమ పార్టీ రెబెల్ అభ్యర్థులను బుజ్జగించి...అవసరమైతే వారికి అగ్రనేతలతో హామీలు ఇప్పించి పోటీలో నుంచి తప్పుకునేలా శతవిధాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మెజార్టీ స్థానాలే లక్ష్యం..
రెబెల్స్ పోటీలో ఉంటే.. సదరు పార్టీ బలహీనపడి తమకు గెలుపు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చని వైరి పార్టీల నేతలు వ్యుహాలకు పదునుపెడుతున్నారు. ఓ నేత తాను పోటీ చేసే వార్డులో పోటీ చేయకుండా వేరే వార్డులోకి వెళ్లి పోటీచేస్తే.. సహకారమందిస్తానని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓ నేత చెప్పాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ అభ్యర్థి వేరే వార్డులో నామినేషన్ వేశారని చెప్పుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గజ్వేల్–ప్రజాపూర్ మున్సిపల్ ఎన్నికల తీరు వైరి పార్టీల వ్యూహప్రతివ్యూహాలతో మరింత వేడెక్కనుంది.
దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తలనొప్పిగా తయారైంది. 20 వార్డులకు 235 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల కంటే ఎక్కువగా దుబ్బాకలో నామినేషన్లు దాఖలు కావడం శోచనీయం. శనివారం నిర్వహించిన పరిశీలనలో అన్ని నామినేషన్లు సరిగ్గానే ఉండటంతో 127 మంది బరిలో ఉన్నారు. కాగా వీటిలో అభ్యర్థులు వివిధ వార్డులకు రెండు, మూడు సెట్లు వేశారు. ఆదివారం 10 వ వార్డు నుంచి నామినేషన్ వేసిన బడుగు మాధవి ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం 126 మంది బరిలో ఉన్నారు.
టికెట్ ధీమాతో..
మున్సిపాలిటీలో ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో చాలా మంది అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించడం ప్రధాన పార్టీల నాయకులకు తలనొప్పిగా తయారైంది. నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3వ తేది 3 గంటల వరకే గడువు ఉంది. కేవలం రెండు రోజులు మాత్రం గడువు ఉండడంలో బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అలాగే తమకు నష్టం కలగకుండా పలు వార్డులలో స్వతంత్రులను సైతం విత్‌డ్రా చేయించాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు.
ఎత్తుకు.. పైఎత్తు


