
విద్యారంగంపై నిర్లక్ష్యమేలా?
గజ్వేల్‌రూరల్: విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని బీజేపీ, బీఆర్‌ఎస్‌వీ నాయకులు అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం’ శీర్షికన ప్రచురితమైన కథనం మేరకు ఆయా పార్టీల నాయకులు పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లను సందర్శించారు. విద్యార్థులతో మట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మధ్యాహ్న భోజన బిల్లులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కార్యక్రమాల్లో బీజేపీ గజ్వేల్ మండలశాఖ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నాయకులు మన్నె శేఖర్, అరవింద్, శ్రీనివాస్, కుమార్, చంద్రం, రాజు, మహేందర్, బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు మోహన్‌బాబు, వర్గల్ మండల అధ్యక్షుడు స్వామిగౌడ్, జగదేవ్‌పూర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.