
మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం
ఒళ్లంతా ద ద్దుర్లు, కురుపులు
● అర్ధాకలితో విద్యార్థులు విలవిల
● కలుషిత నీటితో చర్మ రోగాలు
● ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలు
గజ్వేల్/గజ్వేల్ రూరల్: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అధునాతన ప్రమాణాలతో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్‌లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం మెతుకులే దిక్కవుతున్నాయి. మరోవైపు కలుషిత నీటితో చర్మరోగాల బారిన పడి అల్లాడుతున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పట్టణంలోని ‘సాక్షి’ బాలుర ఎడ్యుకేషన్ హబ్‌ను సందర్శించింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తంగా 529 విద్యార్థులు ఉండగా, మధ్యాహ్న భోజన సమయానికి 509మంది ఉన్నారు. వారి భోజనాన్ని పరిశీలించగా పేట్లల్లో గొడ్డుకారం కనిపించింది. కూరలు వండటం లేదా? గొడ్డుకారంతో ఎందుకు తింటున్నారు? అని అడిగితే కూరలు అయిపోయాయని కారం వేస్తున్నారంటూ బదులిచ్చారు. కారాన్ని తినలేకపోతున్నామని అర్ధాకలితోనే ఉంటున్నామని చెప్పారు. ఇదే క్రమంలో వంట గదిలోకి ‘సాక్షి’ వెళ్లి చూడగా ఓ మహిళ విద్యార్థుల ప్లేట్లల్లో కారం పొడి వేస్తూ కనిపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఈ రోజు పిల్లలు ఎక్కువగా రావడం వల్ల కూరలు అయిపోయాయని చెప్పడం గమనార్హం. మరో విషయమేమిటంటే భోజనాన్ని పిల్లలే తమ ప్లేట్లలో వేసుకోవడం కనిపించింది. అపరిశుభ్ర వాతావరణంలో ప్లేట్లను కడగడం, నేలపైనే కూర్చొని తినడం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పిల్లలు ఏం తింటున్నారు? వారికి భోజనం సరిపోయిందా? లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన ఉపాధ్యాయులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆఫీస్ రూమ్‌లో ఉండటం గమనార్హం.
ఇదే హబ్‌లోని బాలుర జూనియర్ కళాశాలను సైతం ‘సాక్షి’ సందర్శించింది. ఈ కళాశాలలో 571 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా ఇదే ప్రాంగణంలోని హాస్టళ్లల్లో ఉంటున్నారు. కలుషిత నీటితో పిల్లలకు చర్మ రోగాలు వచ్చాయి. ఒళ్లంతా దద్దుర్లు, కురుపులతో అల్లాడుతున్నారు. మరికొందరు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణం దృష్టిసారిస్తేనే సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం