
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
సీసీ కెమెరాలు తప్పనిసరి
● కలెక్టర్ హైమావతి
● సివిల్‌సప్లై, డీఆర్‌డీఓ అధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ హైమావతి మిల్లర్లు, అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డీఆర్డీఓ అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోళ్లు సివిల్ సప్లై శాఖ అందించిన మార్గదర్శకాల మేరకు కొనుగోలు చేయాలన్నారు. ఈ సీజన్‌లో 6లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 239 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. కొనుగోలు చేయగానే గన్నీబాగుల్లో నింపి మిల్లులకు పంపించాలని తెలిపారు. మిల్లులో సైతం తేమ శాతం పరిశీలించాలన్నారు. మిల్లర్లు అగ్రిమెంట్ చేసుకుని బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. వరి ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్‌లైన్ ఎంట్రీ చేయాలన్నారు. ఫిజికల్ స్టాక్ , రిజిస్టర్ ఎంట్రీ సమానమవ్వాలన్నారు. లేబర్ కొరత లేకుండా చూసుకుని, ఎక్కడైనా ధాన్యం మళ్లించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎస్‌ఓ తనూజ, డీఎం సీఎస్ ప్రవీణ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, డీటీఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టుద్వారా పంపిణీ చేస్తున్నాం
నూతనంగా వస్తున్న ఓటర్ కార్డులను పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోనీ బీఎల్‌ఓ లకు ఐడీ కార్డ్ ల పంపిణీ పూర్తి చేశామన్నారు. నూతన ఎపిక్ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఫామ్ 6, 7, 8 దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని, జిల్లాలో చనిపోయిన వారిని గుర్తించి, మిగతా వారి వయస్సు ధ్రువీకరణను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, కలెక్టరేట్ ఏఓ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌రూరల్: పోతారం(ఎస్)లోని గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పాఠశాల బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు భద్రత ఉంటుందని చెప్పారు. ఈ నెల 7న విద్యార్థి వివేక్ మృతి చెందిన విషయంపై తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావదని హెచ్చరించారు. రాత్రి వేళ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు.